హైదరాబాద్: తోటి ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మరోసారి కస్టడీకి కోరారు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు శుక్రవారం (ఆగస్ట్ 7) కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శనివారం (ఆగస్ట్ 8) కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాగా, రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ)లో తోటీ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై ఉదయ్ కృష్ణారెడ్డిని లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బాధిత ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు మేరకు జూలై 18న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జులై 28న మిర్యాలగూడలో నిందితుడు పోలీసులకు చిక్కాడు.
ఈ క్రమంలో పూర్తి విచారణ జరిపేందుకు పోలీసులకు అవకాశం లభించలేదు. దీంతో కేసుకు సంబంధించి మరిన్నీ వివరాలు రాబట్టేందుకు ఉదయ్ కృష్ణారెడ్డిని ఏడు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు రెండు రోజులు మాత్రమే పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. శుక్రవారం (ఆగస్ట్ 7) సాయంత్రం 5 గంటలతో పోలీసులకు కోర్టు ఇచ్చిన గడువు ముగిసింది.
అయితే, రెండు రోజుల కస్టడీలో ఉదయకృష్ణ రెడ్డి నోరు మెదపలేదని.. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు నిరాకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో ఉదయకృష్ణ రెడ్డిని మరోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఉప్పరపల్లి కోర్టులో శనివారం (ఆగస్ట్ 8) ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
