మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో గిగ్ వర్కర్ల సమ్మె వాయిదా

మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో గిగ్ వర్కర్ల సమ్మె వాయిదా

హైదరాబాద్: కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో గిగ్ వర్కర్ల సమ్మె వాయిదా పడింది. TADF సలావుద్దీన్ ఈ వివరాలను వెల్లడించారు. లేబర్ డిపార్ట్‌మెంట్‌లో యాప్ బేస్డ్ డ్రైవర్స్, గిగ్ వర్కర్స్ యూనియన్లతో జాయింట్ మీటింగ్ ముగిసిందని చెప్పారు. ఓలా, ఉబర్ , రాపిడో, జొమాటో స్విగ్గీ యాజమాన్యాలతో పాటు పలు ట్రేడ్ యూనియన్లతో సమావేశం జరిగింది.

ప్రభుత్వం నిర్ణయించే రేట్లనే అమలు చేస్తామని ఓలా, ఉబర్ హామీ ఇచ్చారని TADF సలావుద్దీన్ తెలిపారు. వైట్ ప్లేట్ వాహనాల విచ్చలవిడి వినియోగంపై వినతి చేశామని, వైట్ ప్లేట్ టూ, త్రీ, ఫోర్ వీలర్స్ వినియోగంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ నుంచి హామీ దక్కిందని చెప్పారు.

మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌పై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేస్తామన్నారని, వారం, పది రోజుల్లో కొత్త అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ రూపొందిస్తామని రవాణా శాఖ తెలిపిందని చెప్పారు. లేబర్, ట్రాన్స్‌పోర్ట్ ఉన్నతాధికారులతో కలిసి యూనియన్లతో మంత్రి వివేక్ వెంకటస్వామి చర్చించారు. గిగ్ వర్కర్ల చట్టానికి రూల్స్, వెల్ఫేర్ బోర్డు త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15 నాటికి రూల్స్, వెల్ఫేర్ బోర్డు పూర్తి చేస్తామని మంత్రి  వివేక్ హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం స్పందనతో నిరవధిక సమ్మెను తాత్కాలికంగా పోస్ట్ పోన్ వేస్తున్నామని, వారం నుంచి పది రోజుల పాటు సమ్మె వాయిదా వేస్తున్నామని TADF సలావుద్దీన్ ప్రకటించారు. పర్ కిలోమీటర్, పర్ మినిట్ ఆధారంగా బేస్ ఫేర్ నిర్ణయించాలని గిగ్ వర్కర్లు డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్ల చట్టంలో రూల్స్, వెల్ఫేర్ బోర్డును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నది గిగ్ వర్కర్ల ప్రధాన డిమాండ్. తమను చర్చలకు పిలిచినందుకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి, కార్మిక శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.