- బ్యాంక్ గ్యారంటీలతో సమానంగా గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టర్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పనుల టెండర్లలో పాల్గొనే వారు ఇకపై నగదు లేదా బ్యాంక్ గ్యారెంటీలతో పాటు 'ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్లను' కూడా సమర్పించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఫైనాన్షియల్ కోడ్‌లోని నిబంధనలను సవరిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణంగా టెండర్లలో పాల్గొనేటప్పుడు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కోసం కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో నగదును బ్యాంకుల్లో ఉంచాల్సి వచ్చేది. దీనివల్ల వారి వద్ద నగదు లభ్యత తగ్గి పనుల వేగంపై ప్రభావం పడేది.
ఇప్పుడు ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్లను కూడా అనుమతించడం వల్ల కాంట్రాక్టర్లపై ఆర్థిక భారం తగ్గి, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్ల విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. బాండ్లు కేవలం ఐఆర్డీఏఐ గుర్తింపు పొందిన ఇన్సూరెన్స్ కంపెనీలు జారీ చేసినవి మాత్రమే అయి ఉండాలి. ఇవి ఎలాంటి షరతులు లేనివిగా, వెనక్కి తీసుకోలేనివిగా ఉండాలి. కోరిన వెంటనే నగదు రూపంలో చెల్లించే విధంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
