- హార్మూజ్‌ను తెరవడం,చిన్న సైనిక చర్యే.. కానీ నాటో దేశాలు భయపడుతున్నయ్
- ఇరాన్ ‘ట్రంప్ జలసంధి’ని తెరవాలంటూ సెటైర్
వాషింగ్టన్: నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు అండగా నిలవని పక్షంలో.. భవిష్యత్తులో ఆయా దేశాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం తమకు లేదని తేల్చిచెప్పారు. మయామిలో జరిగిన ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో ప్రసంగిస్తూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నాటో కూటమి వైఖరిని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘మేం ఎల్లప్పుడూ వారి కోసం సిద్ధంగా ఉంటాం. బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాం. కానీ వారి ప్రస్తుత ప్రవర్తన చూస్తుంటే, మేం అక్కడ ఉండాల్సిన అవసరం లేదనిపిస్తున్నది. మాకు అవసరమైనప్పుడు వారు లేనప్పుడు, వారి కోసం మేం ఎందుకు వెళ్లాలి?” అని ఆయన ప్రశ్నించారు. అమెరికా అండ లేకపోతే నాటో ఒక ‘కాగితపు పులి’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. నాటోలోని కీలకమైన ‘ఆర్టికల్ 5’ (ఒకరిపై దాడి జరిగితే అందరూ స్పందించడం)పై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికాకు చిరకాల మిత్రదేశాలైన బ్రిటన్, స్పెయిన్‌లను కూడా ట్రంప్ వదల్లేదు. ఇరాన్-–ఇజ్రాయెల్ పోరులో బ్రిటన్ సహకారం నామమాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి మార్గాన్ని పునరుద్ధరించేందుకు యూరప్ దేశాలు ముందుకు రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జలసంధిని తెరవడం ఒక చిన్న సైనిక చర్య మాత్రమేనని, కానీ నాటో దేశాలు పిరికిపందలుగా వ్యవహరిస్తూ సహకరించడం లేదని ఆరోపించారు.
ఇరాన్ సుప్రీం లీడర్‌పై సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వం మొత్తాన్ని తుడిచిపెట్టామని, మొజ్తబా చనిపోయే ఉంటారని పేర్కొన్నారు. ‘‘వారి నాయకులు మరణించారు. వారి సుప్రీం లీడర్ ఇక ఎంతమాత్రం సుప్రీం కాదు. ఆయన చనిపోయారు. అతని కుమారుడు (మొజ్తబా) కూడా మరణించి ఉండాలి లేదా చాలా దారుణమైన స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఆయన నుంచి ఎలాంటి ప్రకటనలు రావట్లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా నాశనం అయ్యాయని స్పష్టం చేశారు. ‘‘వారి వద్ద 22 మైన్లను వేసే నౌకలు ఉండేవి.. ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. ఇక వారు మైన్లు వేయాలంటే చిన్న పడవలపై వెళ్లాల్సిందే’’ అని ఎద్దేవా చేశారు.
‘ట్రంప్ జలసంధి’ని తెరవాలంటూ సెటైర్
ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఉద్దేశపూర్వకంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ ట్రంప్’ (ట్రంప్ జలసంధి) అని పిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘‘మనం చర్చలు జరుపుతున్నాం. ఇరాన్ శాంతి ఒప్పందంలో భాగంగా ఆ జలసంధిని తెరిచి ఉంచాలి. వారు ‘స్ట్రెయిట్ ఆఫ్ ట్రంప్’ను.. అంటే నా ఉద్దేశం హార్మూజ్ జలసంధిని తెరవాలి. క్షమించండి, పొరపాటు జరిగింది!” అని చమత్కరించారు. మళ్లీ వెంటనే.. ‘‘పొరపాటున ట్రంప్ జలసంధి అన్నానని ఫేక్ వార్తలు రాస్తుంటారు. కానీ నా దగ్గర అలాంటి పొరపాట్లేం ఉండవు’’ అని అన్నారు.
మోదీ, ట్రంప్ ఫోన్ కాల్‌లో మస్క్ లేరు
న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఖండించిన కేంద్రం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న ఫోన్‌లో మాట్లాడుకున్నప్పుడు బిలియనీర్ ఎలాన్ మస్క్ జోక్యం చేసుకున్నారన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇద్దరు దేశాధినేతల మధ్య సంభాషణలో ఓ ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం అరుదైన సంఘటన అంటూ ‘న్యూయార్క్‌టైమ్స్’ పత్రిక ప్రచురించిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని విదేశాంగ శాఖ శనివారం స్పష్టం చేసింది. ఆ సంభాషణలో మూడో వ్యక్తికి చోటు లేదని పేర్కొంది. మార్చి 24న మోదీ-, ట్రంప్ మాత్రమే ఫోన్‌లో మాట్లాడారని తెలిపింది. హార్మూజ్ జలసంధి ఓపెన్‌చేయాలని, అందులో నౌకల ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని మోదీ చెప్పినట్టు వెల్లడించింది.
