కొద్దిరోజుల క్రితం పాట్నా-టాటానగర్ వందే భారత్ రైలులో ఇచ్చిన అముల్ పెరుగు కప్పులో పురుగులు ఉన్నాయంటూ ఒక వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అముల్ కంపెనీ స్పందిస్తూ, ఆ పురుగులు మా పెరుగు వల్ల రాలేదని తేల్చి చెప్పింది.
అముల్ పెరుగును అత్యంత శుభ్రమైన వాతావరణంలో (ISO సర్టిఫైడ్ ప్లాంట్స్) తయారు చేస్తారు. పెరుగులో ఉండే ఆమ్ల గుణం (Acidic nature) వల్ల, ప్యాకెట్‌లో గాలి (ఆక్సిజన్) ఉండదు కాబట్టి, అందులో పురుగులు బ్రతకడం లేదా పుట్టడం అస్సలు సాధ్యం కాదని కంపెనీ వివరించింది.
ఓ ప్రయాణికుడికి భోజనం అందించిన 'సర్వింగ్ ట్రే' సరిగ్గా లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని అముల్ తెలిపింది. పురుగులు ట్రే మీద ఉన్నాయే తప్ప, సీల్ చేసిన పెరుగు కప్పు లోపల లేవని వీడియో విశ్లేషణలో తేలిందని పేర్కొంది. ఆ రైలుకు సప్లయ్ చేసిన పెరుగు బ్యాచ్, మా అధికారిక నెట్‌వర్క్ ద్వారా వెళ్ళలేదని కూడా కంపెనీ గుర్తించింది.
రైల్వే శాఖ తీసుకున్న చర్యలు
ఈ ఘటనపై రైల్వే శాఖ చాలా సీరియస్‌గా స్పందించింది. క్యాటరింగ్ సర్వీస్ అందించే ప్రైవేట్ సంస్థకు రూ.50 లక్షలు, ఐఆర్‌సిటిసి (IRCTC)కి రూ. 10 లక్షలు.. మొత్తంగా రూ.60 లక్షల జరిమానా విధించింది.
నాణ్యత పాటించనందుకు ఆ ప్రైవేట్ ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. అముల్ ఉత్పత్తుల నాణ్యతపై నమ్మకంగా ఉందని, రైల్వే విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించింది. ప్రజలు ఏవైనా సందేహాలు ఉంటే మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చని కోరింది.
