వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర స్థాయి కమిషన్ ఏర్పాటు!

వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర స్థాయి కమిషన్ ఏర్పాటు!
  •     తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో కోత
  •     అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ముకుతాడు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రక బిల్లును తీసుకువచ్చింది. "తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026" పేరుతో రూపొందించిన ఈ బిల్లును  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  దీని ప్రకారం..ఉద్యోగం చేస్తున్న పిల్లలు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతంలో  కొంత కోత విధించి నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. 

తమకు సరైన ఆదాయ వనరులు లేవని, పిల్లలు తమను పోషించడం లేదని తల్లి లేదా తండ్రి అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విచారణ అనంతరం ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా గరిష్టంగా 15 శాతం లేదా రూ.10,000 (ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది) కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. 

వృద్ధుల కమిషన్ ఏర్పాటు

ఈ బిల్లు చట్టమైన తరువాత అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయి కమిటీతో పాటు, ప్రత్యేకంగా ‘వృద్ధుల కమిషన్’  ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిషన్‌‌‌‌‌‌‌‌లో ఒక ప్రధాన కమిషనర్, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఎవరైనా అధికారి లేదా యజమాని చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు విధించే అధికారం కూడా  కమిషన్‌‌‌‌‌‌‌‌కు ఉంటుంది. కలెక్టర్ లేదా ప్రత్యేక జిల్లా మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌ ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు. 

60 రోజుల్లోగా విచారణ పూర్తి

తల్లిదండ్రుల నుంచి దరఖాస్తు అందిన 60 రోజుల్లోగా అధికారులు విచారణ పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే లేదా అధికారి ఇచ్చిన ఆర్డర్‌‌‌‌‌‌‌‌పై అభ్యంతరాలు ఉంటే పైఅధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా  కల్పించారు. మారుతున్న కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు పెరుగుతున్నాయని, తమను కనిపెంచిన తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నందున వారిలో నైతిక బాధ్యతను పెంచేందుకు ఈ చట్టం ఎంతో అవసరమని ప్రభుత్వం పేర్కొంది.