రాఘవ కన్‎స్ట్రక్షన్పై చర్యలు తీసుకోవాలి : మాజీ మంత్రి హరీశ్ రావు

రాఘవ కన్‎స్ట్రక్షన్పై చర్యలు తీసుకోవాలి : మాజీ మంత్రి హరీశ్ రావు
  •     మంత్రి పొంగులేటి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
  •     ప్రతిపక్ష సభ్యులతో హౌస్ కమిటీ వేయాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ నిబంధనలను తుంగలో తొక్కి, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. అధికారులు నోటీసులు ఇచ్చినా ఆ సంస్థపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. మంత్రికొక న్యాయం.. ఇతరులకో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. 

శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ మండలం కోత్వాల్ గూడలో జీవో 111 నిబంధనల ప్రకారం ఎలాంటి కాలుష్య పరిశ్రమలు ఉండకూడదని.. కానీ, అక్కడ రాఘవ కన్‎స్ట్రక్షన్స్ యథేచ్ఛగా భారీ స్టోన్ క్రషర్ నడుపుతోందని హరీశ్ రావు ఆరోపించారు. ఈ సంస్థకు మినరల్ డీలర్ లైసెన్స్ లేదని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీఎఫ్​ఈ, సీఎఫ్ఓ పర్మిషన్లు లేవని చెప్పారు. కరెంట్ కనెక్షన్ కావాలంటే ఈ పత్రాలన్నీ ఉండాలి కాబట్టే.. అవన్నీ లేకుండా దొంగచాటుగా భారీ డీజిల్ జనరేటర్ల సాయంతో క్రషింగ్ చేస్తూ ఆదాయానికి గండికొడుతున్నారని ఆరోపించారు. 

గతేడాది మే నెలలో అధికారులు దాడులు చేసి 5,130 మెట్రిక్ టన్నుల అక్రమ రఫ్ స్టోన్ నిల్వలను పట్టుకున్నారని, నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 24 లక్షల పెనాల్టీ కట్టాలని మైనింగ్ శాఖ నోటీసు ఇచ్చినా.. ఆ సంస్థ పైసా కట్టలేదని వివరించారు. మార్చి4న అధికారులకు 11,200 టన్నుల ముడి సరుకు దొరికిందని.. దీంతో మరో షోకాజ్ నోటీసు ఇచ్చారని గుర్తుచేశారు. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడి క్రషర్ లో చిన్న తప్పు దొరికితే రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి నెల రోజులు జైల్లో పెట్టారని.. మరి రాఘవ కన్‎స్ట్రక్షన్స్ రెండుసార్లు అక్రమాల్లో పట్టుబడినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

హౌస్ కమిటీ వేయాల్సిందే.. 

గతంలో తాను ఈ అక్రమాలపై ట్వీట్ చేస్తే.. మంత్రి స్పందిస్తూ మొరిగే కుక్కలకు గొలుసు వేస్తం అని మాట్లాడారంటేనే దీని వెనుక ఎవరి హస్తం ఉందో అర్థమవుతోందని హరీశ్​ రావు అన్నారు. మంత్రి పొంగులేటి తక్షణమే రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యులతో హౌస్ కమిటీ వేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. 

రాష్ట్ర వనరులను కాపాడటం ప్రతిపక్షంగా తమ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. రాఘవ సంస్థపై మాట్లాడే సమయంలో మంత్రిని టార్గెట్ చేస్తూ హరీశ్ రావు విమర్శలు చేయడాన్ని మంత్రులు అడ్డుకున్నారు. పదే పదే స్పీకర్ చెప్పిన తర్వాత కూడా హరీశ్​రావు అలాగే విమర్శలు చేయడంతో మైక్ కట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వెబ్ లోకి వచ్చి ఆందోళనకు దిగారు. 

రాఘవ స్వయాన పొంగులేటి తండ్రి.. 

అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్​ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని హరీశ్​ రావు అన్నారు. మైనింగ్​పై సీఎం రేవంత్​ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై హరీశ్​రావు ఓ ప్రకటనలో  కౌంటర్​ ఇచ్చారు. రాఘవ కన్​స్ట్రక్షన్స్​ మంత్రి పొంగులేటిది కాదని సీఎం చెప్పడం దుర్మార్గమన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ అనే పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరని, ఆ కంపెనీ పొంగులేటిదేనని లోకమంతా తెలుసని చెప్పారు. 

రాఘవ కన్​స్ట్రక్షన్స్​ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి భార్య మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డేనన్నారు. అసెంబ్లీని సీఎం రేవంత్​ తప్పుదోవ పట్టించారన్నారు. సభలో కాంగ్రెస్​ సర్కార్​ డైవర్షన్​ పాలిటిక్స్.. అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలు చెప్తున్నారన్నారు. రాఘవ కన్​స్ట్రక్షన్స్​ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.