దేశ రాజధాని ఢిల్లీలోనే కాలుష్యం ఎక్కువగా ఉంటుందనే పేరుంది. కానీ ఇప్పుడు ఆర్థిక రాజధాని ముంబై కూడా ఆ విషయంలో ఢిల్లీని మించిపోవడం అత్యంత ఆందోళనకరమని బాంబే హైకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముంబైలో రోజురోజుకూ దిగజారిపోతున్న ఎయిర్ క్వాలిటీ, విపరీతంగా పెరిగిపోయిన శబ్ద కాలుష్యంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. పండుగ సమయాల్లో కాలుష్య నియంత్రణ చర్యలను సరిగ్గా అమలు చేయడంలో విఫలమైన బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ముంబై పోలీసులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
జస్టిస్ గిరీష్ ఎస్. కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం ఈ విచారణ సందర్భంగా అధికారులను కఠినంగా నిలదీసింది. లక్షలాది మంది ప్రజలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరై అల్లాడిపోతుంటే.. నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ విధులను సరిగ్గా నిర్వర్తించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మంగళవారం సౌత్ ముంబైలోని క్రఫోర్డ్ మార్కెట్ సమీపంలో పోలీసు స్టేషన్ ఎదుటే రద్దీ రోడ్లపై టపాసులు కాల్చడాన్ని కోర్టు ప్రస్తావిస్తూ.. ఇది స్పష్టమైన ఆదేశాల ఉల్లంఘన అని మండిపడింది. అధికారుల నిర్లక్ష్యం రాజ్యా కల్పించిన ఆర్టికల్ 14, 21 ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులను హరించడమేనని స్పష్టం చేసింది.
సముద్ర తీరం, చల్లటి గాలులు వీచే ముంబైలో కూడా ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోవటం అత్యంత బాధాకరమని జస్టిస్ కులకర్ణి ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో విపరీతంగా పెరుగుతున్న ధూళి కాలుష్యానికి కారణమవుతున్న నిర్మాణ రంగ సంస్థలపై తగిన జరిమానాలు విధించడంలో సివిక్ బాడీ విఫలమైందని విమర్శించారు. కేవలం కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతాల డేటాను చూపించి.. రద్దీగా ఉండే ప్రాంతాల దుస్థితిని కప్పిపుచ్చలేరని జస్టిస్ గోఖలే స్పష్టం చేశారు. మంగళవారం స్మగ్ కారణంగా రోడ్లపై విజిబిలిటీ 500 మీటర్లకంటే పడిపోయిందని గుర్తుచేశారు. ప్రజలు బయటకు వెళ్లేముందు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) చూసుకునే పరిస్థితి రాకూడదని కోర్టు అభిప్రాయపడింది.
దీనిపై తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 26 నాటికి బీఎంసీ, ఎంపీసీబీ కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరై కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ముంబై పోలీసు కమిషనర్ అన్ని పోలీసు స్టేషన్ల ఇన్చార్జ్లతో సమావేశమై కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని తేల్చిచెప్పింది. సెలబ్రిటీల క్యాంపెయిన్లు, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించింది. మొత్తానికి ముంబైలో కాలుష్య నియంత్రణపై హైకోర్టు తీసుకున్న ఈ కఠిన వైఖరి అధికారులను మెుద్దు నిద్ర నుంచి మేల్కొల్పుతోందని ప్రజలు అంటున్నారు.
