పాఫోస్ (సైప్రస్): ఇండియా చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో కఠిన సవాల్ ఎదురుకానుంది. ఆదివారం నుంచి జరిగే ఈ పోటీల్లో ఎనిమిది మంది లెజెండ్ గ్రాండ్ మాస్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 15 రోజుల పాటు డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే పోటీల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటిస్తారు.
ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో డి.గుకేశ్‌తో కాండిడేట్స్ టోర్నీ విన్నర్ తలపడతాడు. ప్రస్తుత ఫామ్ ప్రకారం అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫ్యాబియానో కరువాన హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. హికారు నకమురా (అమెరికా), అనీష్ గిరి (నెదర్లాండ్స్), వీ యీ (చైనా), జావోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), ఆండ్రీ ఎసిపెంకో (రష్యా), మథియాస్ బ్లూబామ్ (జర్మనీ) బరిలో ఉన్నారు.
విమెన్స్ కేటగిరీలో మాజీ వరల్డ్ చాంపియన్ తాజ్ జోంగి (చైనా) ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. 2025 వరల్డ్ కప్ విన్నర్ దివ్య దేశ్‌ముఖ్, ఆర్. వైశాలిపైనే అందరి దృష్టి నెలకొని ఉంది.
