నేను భారత జట్టుకు సెట్ కాదేమో.. అందుకే నాకు చోటు దక్కడం లేదా?.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్! 

నేను భారత జట్టుకు సెట్ కాదేమో.. అందుకే నాకు చోటు దక్కడం లేదా?.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్! 

Sarfaraz Khan: భారత టెస్టు జట్టులో మళ్లీ చోటు దక్కకపోవడంపై యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తనలోని నిరాశను, పట్టుదలను బయటపెట్టాడు. రాబోయే శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ సెలెక్టర్లు అతడిని పక్కనబెట్టడంతో, తెలుగు హీరో నాని నటించిన జెర్సీ సినిమాలోని ఒక స్టిల్‌ను షేర్ చేస్తూ.. నేను జట్టు ప్రణాళికల్లో సరిపోకపోవచ్చు, కానీ నా దగ్గర ఉన్న ప్రతిదాంతో పోరాడుతూనే ఉంటాను అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ లేదా బీసీసీఐ పేర్లను నేరుగా ప్రస్తావించనప్పటికీ, జట్టు ప్రకటించిన వెంటనే ఈ పోస్ట్ చేయడం సెలెక్షన్ కమిటీ నిర్ణయంపై అతడి ఆవేదన చెందుతున్నట్లు క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.  

డొమెస్టిక్ క్రికెట్‌లో మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి: 

28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ చివరిసారిగా 2024లో న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరపున ఆడాడు. ఆ సిరీస్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో 171 పరుగులు చేసి మంచిగా ఆడినప్పటికీ, ఆ తర్వాత అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్, శ్రీలంకల మధ్య ఆగస్టు 15వ తేదీ నుంచి గాలే వేదికగా తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో, సర్ఫరాజ్ మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నాడు. 

శుభ్‌మన్ గిల్ గాయం వేళ సర్ఫరాజ్ వ్యాఖ్యలు: 

భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్ చేసే సమయంలో కుడిచేతికి గాయం కావడంతో.. శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ తొలి రోజుకు దూరమవ్వడంతో సర్ఫరాజ్ ఈ పోస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యలు కేవలం తక్షణ ఎంపిక గురించే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు ఇండియా టీమ్ లో స్థానం కోసం పోరాడే అతడి సంకల్పాన్ని స్పష్టం చేస్తున్నాయి. సెలెక్టర్ల ప్రస్తుత ప్రణాళికల్లో తాను లేకపోయినా, తన టెస్టు ఆశయాలను వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేనని అతడి పోస్ట్ తేల్చిచెబుతోంది.