న్యూఢిల్లీ: ఐపీఎల్–19 సీజన్‌కు ఆలస్యంగా వస్తున్నందుకు తనపై వస్తున్న విమర్శలను ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ తీవ్రంగా ఖండించాడు. క్యాపిటల్స్ పట్ల తనకు నిబద్ధత లేదని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం తప్పుడు సమాచారమేనని మండిపడ్డాడు. గాయం కారణంగానే తాను జట్టుకు దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. ‘కొందరు వ్యక్తులు ఇండియా మీడియా వేదికగా నాపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నేను భుజం, మోచేతి గాయాల నుంచి కోలుకుంటున్నా. ఆస్ట్రేలియా సమ్మర్ సీజన్ టైమ్‌లో ఈ గాయాల తీవ్రత నాకు తెలియలేదు. నా శరీరం గురించి నాకంటే వారికే ఎక్కువ తెలుసన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇది సరైంది కాదు’ అని స్టార్క్ పేర్కొన్నాడు. గత సీజన్‌లో 14 వికెట్లు తీసిన స్టార్క్.. ఈ సారి లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేనందుకు క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి క్షమాపణలు చెప్పాడు.
