పెట్రోల్, గ్యాస్ సరఫరాపై అపోహలు వద్దు : మంత్రి ఉత్తమ్

పెట్రోల్, గ్యాస్ సరఫరాపై అపోహలు వద్దు : మంత్రి ఉత్తమ్
  • సరఫరా సాఫీగా కొనసాగుతోంది: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ వంటగ్యాస్ సరఫరాపై ప్రజల్లో ఏర్పడిన అపోహలు, భయాందోళనలను రాష్ట్ర  ప్రభుత్వం సమర్థవంతంగా అదుపు చేసిందని సివిల్​ సప్లయ్స్​మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం కేంద్ర పెట్రోలియం మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరి, ప్రహ్లాద్ జోషీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొని మాట్లాడారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్‌‌‌‌‌‌‌‌కు తగినట్లు సరఫరా సాఫీగా కొనసాగుతోందని, వినియోగదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నట్లు  వివరించారు. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ కోటా పెంచాలని కేంద్ర మంత్రులను మంత్రి ఉత్తమ్​ కోరారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు గ్యాస్‌‌‌‌‌‌‌‌ను తరలించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. 

పట్టణ ప్రాంతాల్లో పైప్ లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా విస్తరణలో కేంద్రంతో సమన్వయం చేసుకుంటామని, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో భాగ్యనగర్ గ్యాస్ సంస్థ ద్వారా సీఎన్​జీ సరఫరాను విస్తరిస్తామని తెలిపారు. జంట నగరాల్లో ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలకు సీఎన్​జీ ఫిల్లింగ్ స్టేషన్లు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర సివిల్​ సప్లయ్స్​ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులు  పాల్గొన్నారు.