వెలుగు ఓపెన్ పేజీ : ఇరాన్ కు ఇంత బలమెక్కడిది?

వెలుగు ఓపెన్ పేజీ :  ఇరాన్ కు ఇంత బలమెక్కడిది?

గత  నెల రోజులుగా  జరుగుతున్న ఇరాన్– అమెరికా, ఇజ్రాయెల్​ యుద్ధంలో  ఇరాన్​ ఊహించనటువంటి  యుద్ధ బలాన్ని,  ఎత్తుగడలను, పట్టుదలను చూపిస్తున్నది.  చివరికి  అమెరికా కాళ్ల బేరానికి  వచ్చినా  తాను  లెక్క చేయనట్టు వ్యవహరిస్తున్నది.  అమెరికా  ఒకవైపు సీజ్​ ఫైర్​ అని ప్రకటిస్తే  ఇరాన్  తన పద్ధతిలో తాను అటు ఇజ్రాయెల్​పైనా,  చుట్టూ ఉన్న సున్నీ ముస్లిం దేశాలలోని  అమెరికా స్థావరాల మీద,  ఆయా దేశాల  ఆయిల్ బావులమీద  ద్రోణులు, మిసైళ్ల  దాడులు చేస్తూనే ఉన్నది.   అమెరికా,  ఇజ్రాయెల్​  ఇరాన్​పై  బాంబుల దాడి  మొదలుపెట్టినప్పుడు  ఒక్కవారం రోజుల్లో ఇరాన్​ను ధ్వంసంచేసి అక్కడి ప్రభుత్వాన్ని మార్చి తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచుతామని భావించాయి.   ప్రపంచమంతా కూడా అలానే  భావించింది.  మొదటిరోజే  వృద్ధ  ఖమేనీని చంపేసి,  తరువాత  వరుసగా మరి కొంతమంది  అధికారులను,  కొంతమంది  కీలకమైన  సైంటిస్టులను చంపేశారు.  సైంటిస్టులను  సైతం ఎక్కడ ఉన్నా  ఇజ్రాయెల్​కు ఉన్న స్పాట్  లోకేషన్​  మిసైల్ శక్తితో  చంపేశారు.  ఇది చాలా అన్యాయం, అమానుషత్వం.  కానీ ఆ పద్ధతిలోనే  ఇంతకుముందు  హమాస్​ నాయకులను  కూడా చంపేశారు.  అదే పద్ధతి ఇక్కడా అనుసరించారు.  

అమెరికాకు ఉన్న అణు ఆయుధశక్తి  ప్రపంచంలోనే  ఇతర దేశాలు ఏవీ సరితూగనటువంటిది.  ఇజ్రాయెల్​ గత  రెండేండ్లుగా  జామ్​ చితకగొట్టి,  హమాస్, లెబనాన్​లను  ధ్వంసం చేసే పనిలోనే ఉన్నది. అయినా దాని మిసైల్​ శక్తి తరగడం లేదు.  ఇంత శక్తి ఉన్న రెండు  నూక్లియర్​ పవర్​ దేశాలను ఇరాన్​ ఇప్పుడు ముప్పుతిప్పలు పెడుతున్నది.  రీజియన్​ని  మార్చేస్తామని  రోజువారీగా   ట్రంప్​ చేసిన ప్రకటనలు  సాధ్యంకాదని తన యుద్ధ శక్తితో  చెబుతున్నది.   తండ్రి చనిపోయాక సుప్రీం పవర్​ అయిన కొడుకు ఖమేనీ జూనియర్​ను  కూడా తీవ్రంగా  గాయపర్చారు. అయినా ఇరాన్​ అదరలేదు,   బెదరలేదు.  ఒక ముల్లా రాజ్యం అనుకున్న  ఇరాన్​ ఇంతటి ఆయుధ బలాన్ని,  శాస్త్రీయ శక్తిని, యుద్ధ ఎత్తుగడలను  ఎలా  సంపాదించుకుంది?  ఇప్పటికే బాంబుల దాడుల్లో  దాదాపు 4 వేలమంది  సాధారణ ప్రజలు  చనిపోయారని ఇరానీయులు చెబుతున్నారు. అయినా అది జంకడం లేదు.  అమెరికా,  ఇజ్రాయెల్​ చుట్టూ ఉన్న అరబ్​ దేశాలు తనకు శత్రువులుగా ఉన్నా  ప్రపంచ రవాణా వ్యవస్థను  అతలాకుతలంచేసి తానే యుద్ధంలో  గెలుస్తున్నా అనే స్థితి ఇరాన్​ కల్పించింది. 

ఇరాన్​ పాపులేషన్​ ఎక్కువ కూడా కాదు

2026లో ఇరాన్​ పాపులేషన్​ 93.17 మిలియన్​ ప్రజలు మాత్రమే. ఇజ్రాయెల్​ 2026లో  10.1 మిలియన్​ ప్రజలున్నట్టు ఇంటర్​నెట్​  సోర్స్​ చూపెడుతున్నాయి.  అయితే, ఇరాన్​ ల్యాండ్​ సైజులో  ఇజ్రాయెల్​ కంటే చాలా పెద్దది.  అది  1.648 మిలియన్​ స్క్వేర్​ మీటర్లు ఉంటే ఇజ్రాయెల్​ 22, 145 స్క్వేర్​కిలోమీటర్లు  మాత్రమే ఉన్నది.  ఇరాన్​ భూభాగంలో  చాలా ఆయిల్​ గనులు ఉన్నాయి.  సారవంతమైన  పంటభూమి కూడా  ఉంది.  ఆ దేశంలో  పర్వతాలు,  నదులు  కూడా  ఉన్నాయి.  దానికి  సముద్ర వనరు ఉంది.  ఇజ్రాయెల్​లాగే  ఇరాన్​కు  అతి  ప్రాచీన చరిత్ర ఉంది.  మన దేశానికి  వలసవచ్చిన ఆర్యుల్లో  ఎక్కువగా  ఇరాన్​ నుంచి వచ్చినవారే  అని  చరిత్ర  చెబుతున్నది.  ఈ  ఇరానీ జాతికి  తన  నాగరికతపట్ల,  తన రేస్​ పట్ల  ఎనలేని  ఆత్మగౌరవం  కనబడుతుంది.  అయితే  ఇరాన్​ ముస్లిం దేశంగా  మారినప్పుడు  ఇక్కడ మాత్రమే సున్నీతెగ బాగా  పెరిగింది.  ఈ  తెగ  ప్రొఫెట్​ మహమ్మద్​ అల్లుడి  అలీ  వారసత్వాన్ని  ఎక్కువగా గౌరవిస్తుంది.  1970వ  దశకంలో  ఇరాన్​ షా ఆప్​ ఇరాన్  ​నేతృత్వంలో బాగా ఆధునిక దేశంగా మారింది.  మొత్తం  ముస్లిం దేశాల్లో ఎక్కువ సెక్యులర్​ దేశంగా మారింది ఇరాన్​అని ఆనాడు దాన్ని చరిత్రకారులు పొగిడారు కూడా.  అయితే షా  ఇరాన్​ నియంతగా  మారుతున్న క్రమంలో  1980వ  దశకంలో  అక్కడి  ముల్లాలు,  ప్రజలు కూడా తిరగబడి షా  వంశాన్ని  దేశం నుంచి పారిపోయేటట్టు చేశారు.  అప్పటి నుంచి ఖమేనీ వంశ  ముల్లాలు అధినేతలుగా  ఇరాన్​ను  పరిపాలిస్తున్నారు.  ఈ క్రమంలో  మళ్లీ  ఇరాన్​లో  స్త్రీల హక్కులను  రద్దు చేయడం,  షియా మతం పట్టును పెంచడం, అమెరికా, ఇజ్రాయెల్​ వ్యతి రేకతని  ప్రజల్లో బాగా పెంచడం ఖమేనీలు చేశారు.  

పాలస్తీనాకు మద్దతు

ఒక విషయంలో  ఇరాన్​ కనిసిస్టెంట్​గా  ఉన్నట్టు కనిపిస్తున్నది.  అది ఇజ్రాయెల్​ జుడా దేశంగా  ఏర్పడటం.  1948లో చాలా దేశాల నుంచి జుడాలు  తిరిగి ఇజ్రాయెల్ వచ్చి సెటిల్ కావడం,  ఇజ్రాయెల్​ అంతా పాలస్తీనా దేశంగా ఉండాలని,  దాన్ని తిరిగి ఇజ్రాయెల్​గా  బ్రిటిష్  అనుబంధ  దేశాలన్నీ రెండో  ప్రపంచ యుద్ధం తరువాత  ప్రకటించడాన్ని ఇరాన్​ గట్టిగా 
వ్యతిరేకించింది.  అప్పటి  నుంచి ఇరానీ ప్రజలు కూడా  ఇజ్రాయెల్​ జ్యూస్​ని  శత్రువులుగానే  చూస్తున్నారు. అక్కడ స్త్రీలు ఒకపక్క హక్కుల కోసం కొట్లాడుతూనే  మరోపక్క  జ్యూస్​ వ్యతిరేకులుగా పోరాడటంలో ఉంటూనే ఉంటారు.  ఈ జ్యూస్​ వ్యతిరేక సంస్కృతే ఇరాన్​ను  యుద్ధ యంత్రాంగాన్ని నిరంతరంగా పెంచడానికి  కారణమైంది.   స్త్రీలతో సహా  ఎక్కువ మంది  ఇరానీలు సైనిక శక్తిగా మారారు.  ఈ  సంస్కృతి  ఏ ముస్లిం దేశంలోనూ లేదు.

ఇరాన్ ​ స్వయంకృషి

అమెరికా,  యూరప్​ జ్యూస్​  అనుకూల దేశాలు కనుక వాటిని  కూడా  శత్రు క్యాంపులో పెట్టి  తమ  దేశ విద్యా వ్యవస్థను నిర్మించారు.  తమ పిల్లలకు స్కూళ్లల్లో, ఇండ్లల్లో  జ్యూస్​ వ్యతిరేక, అమెరికా వ్యతిరేక  పాఠాలు బోధిస్తుంటారు. ఆ బోధన ప్రభావం, వారి పోరాట పటిమ మనకిప్పుడు కనబడుతుంది.  విచిత్రమేమంటే దేశం  విశాలమైంది, వనరులు ఉన్న దేశమైనా చాలామంది భావించినట్టు ఇక్కడ ముస్లింలు జనాభాను పెంచుకోలేదు. కుటుంబ నియంత్రణ చాలాకాలం  నుంచి వివిధ పద్ధతుల్లో పాటిస్తూ వచ్చారు.  మిగతా ముస్లిం దేశాలకు ఇరాన్​ సాంస్కృతిక రంగాల్లో చాలా తేడాలు ఉన్నాయి.  ఇరానీలు వారి విశ్వ విద్యాలయాలను బాగా అభివృద్ధి చేసుకున్నారు. అది ఖమేనీలు అధికారంలోకి వచ్చాక కూడా జరిగింది. తమ దేశ సైంటిస్టులను తమ యూనివర్సిటీల్లోనే ఎక్కువ ట్రైన్​ చేసుకున్నారు.  ఇయ్యాల వారి బలం వారి  స్వయంకృషిలో  కనిపిస్తుంది.  స్వదేశీ సైన్సులో కనిపిస్తుంది. 

ఇదొక పత్వా రాజ్యం కూడా..

ప్రొఫెట్​ మహమ్మద్ మీదగాని, ఆయన అల్లుడు అలీమీదగాని, ఖురాన్​ మీదగాని ఏ చిన్న విమర్శను కూడా అక్కడి పాలకులు సహించరు. ఈ మధ్యకాలంలో ఇతర దేశాల్లో ఈ మూడు అంశాలమీద ఎవరు విమర్శలు గుప్పించినా  చంపేసే   పత్వాలు  ఇరాన్​ జారీ చేస్తుంది.  సల్మాన్​ రష్డీ సంగతే  కాకుండా,  ఫ్రెంచ్​ కార్టూనిస్టులను  చంపించిన  పరిస్థితి  కూడా  మనం చూశాం.  అటువంటి  మత మౌఢ్య  ఇరాన్​ పాలకులు ఇంత  సైంటిఫిక్​ శక్తిని, యుద్ధ ఎత్తుగడలను  ఎలా  సంపాదించారు?  వారి విద్యా వ్యవస్థ మీద అంత రీసెర్చ్​జరిగినట్టు బయట ప్రపంచానికి తెలిసింది లేదు.  అయితే, చైనా,  రష్యాలు ఇరాన్​కు  ఆయుధ, టెక్నిక్, కొంత యుద్ధ మ్యాన్​పవర్​ను సప్లయ్​ చేస్తున్నాయనే  అనుమానాలు ఉన్నాయి.  అవి ఓపెన్​గా  వస్తే  ఈ  యుద్ధం  మూడో  ప్రపంచ యుద్ధంగా మారేది.  కానీ, అలా అసలు అవి కనిపించలేదు. కానీ, ఇరాన్​కు  మద్దతుగా  మాత్రం ఉన్నాయి.  ఏది ఏమైనా ఇరాన్​ యుద్ధశక్తికి  ప్రపంచం  ఆశ్చర్యపోతున్నమాట  వాస్తవం.  అన్ని దేశాల్లో  ఈ చిన్న దేశంతో  జరిగే యుద్ధం ఆర్థిక,  ఇంధన,  రవాణా సంక్షోభాన్ని సృష్టించింది. ఇరాన్​ సముద్ర, వాయు మార్గాలను దెబ్బతీసిన తీరు ఇంతకుముందు ఊహించనటువంటిది.  ఇక ముందు ఎటుపోతుందో చూడాలి. 

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.