Mohanlal: మోహన్ లాల్ కొత్త సినిమా షూటింగ్ క్యాన్సిల్.. శబరిమలలో షూటింగ్కు నో పర్మిషన్ !

Mohanlal: మోహన్ లాల్ కొత్త సినిమా షూటింగ్ క్యాన్సిల్.. శబరిమలలో షూటింగ్కు నో పర్మిషన్ !

మలయాళ బ్లాక్‌బస్టర్ ‘తుడరుమ్’ తర్వాత సూపర్‌స్టార్ మోహన్‌లాల్–దర్శకుడు తరుణ్ మూర్తి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అతిమనోహరం’ (Athimanoharam). ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్, ఎమోషన్, యాక్షన్ మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రానికి శబరిమలలో షూటింగ్ చేసేందుకు భారీ ప్లాన్ చేసినా.. చివరి నిమిషంలో అటవీ శాఖ అనుమతి నిరాకరించడంతో షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.

శబరిమలలో నో పర్మిషన్!

దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ మూవీ షూటింగ్‌కు కేరళ అటవీ శాఖ బ్రేక్ వేసింది. చిత్ర బృందం శబరిమల సన్నిధానం, నాడపంతల్ పరిసరాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాలని భావించింది. అయితే ఈ ప్రాంతం పెరియార్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండటంతో పర్యావరణ పరిరక్షణ నిబంధనల ప్రకారం కేరళ అటవీ శాఖ చిత్రీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. ఆసక్తికరంగా, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాత్రం నాడపంతల్ వరకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కానీ అటవీ శాఖ తుది క్లియరెన్స్ రాకపోవడంతో సన్నిధానంలో జరగాల్సిన షూటింగ్ పూర్తిగా రద్దయింది.

►ALSO READ | Ramayana: ‘రామాయణం’ రూ.4 వేల కోట్ల బడ్జెట్‌పై యష్ క్లారిటీ.. లెక్కలన్నీ బయటపెట్టిన రాకింగ్ స్టార్!

ప్లాన్-B అమలు.. పంబలోనే షూటింగ్!

సన్నిధానంలో అనుమతి లభించకపోయినా చిత్ర యూనిట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. రాన్నీ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పంబ వరకు ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించేందుకు అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 18 నుంచి 20 వరకు పంబ దిగువ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 

మోహన్‌లాల్ పాత్రే హైలైట్!

ఈ చిత్రంలో మోహన్‌లాల్ ‘లవ్‌లజన్’ అనే సాధారణ సబ్-ఇన్‌స్పెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి వ్యక్తిగత జీవితం, విధి నిర్వహణలో ఎదురయ్యే అనూహ్య సంఘటనల చుట్టూ కథ సాగనున్నట్లు సమాచారం. మోహన్‌లాల్ సరసన మీరా జాస్మిన్ కథానాయికగా నటిస్తుండగా, లాలు అలెక్స్, మనోజ్ కె. జయన్, జగదీష్, సుధీష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆశిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆశిక్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.