Velugu Chief Photographer: వెలుగు పత్రికలో పబ్లిష్ అయిన ఫొటోకు అరుదైన గుర్తింపు లభించింది. 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం (TSPJA) నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా ఫోటోగ్రఫీ పోటీలు-2026ల్లో.. వెలుగు పత్రిక చీఫ్ ఫొటోగ్రాఫర్ జెల్లా నవీన్ తీసిన ఫొటోకు అవార్డ్ లభించింది. సమ్మక్క సారక్క జాతరలో తీసిన ఫొటోకు ఈ గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఫోటో జర్నలిస్టుల నుంచి 102 ఎంట్రీలు వచ్చాయి. మొత్తం 336 ఫొటోలు పంపించారు. ఈ ఫొటోలు అన్నింటినీ పరిశీలించిన జ్యూరీ.. అందులో వెలుగు చీఫ్ ఫొటోగ్రాఫర్ జెల్లా నవీన్ తీసిన సమ్మక్క సారక్క జాతర ఫొటోకు కన్సోలేషన్ బహుమతిని ఖరారు చేసింది.
ఫోటో జర్నలిస్టుల్లోని సృజనాత్మకతను, నైపుణ్యాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. TSPJA నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉత్తమ వార్తా ఫోటోగ్రఫీ పోటీలు- 2026లో వెలుగు చీఫ్ ఫోటోగ్రాఫర్ జెల్లా నవీన్ సత్తా చాటారు.
బండెనుక బండి కట్టి.. మేడారం జాతర ఫోటోకి పురస్కారం:
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారక్క మహా జాతర సమయంలో భక్తులు తమ పశువులతో కలిసి ఎడ్లబండ్లపై అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్న ఆత్మీయ దృశ్యాన్ని జెల్లా నవీన్ తన కెమెరాలో బంధించారు. తెలంగాణ సంస్కృతిని, భక్తి శ్రద్ధలను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ ఫోటో జ్యూరీ సభ్యులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ అవార్డు దక్కింది.
Photo Caption : బండెనుక బండి కట్టి పశువులతో ఎడ్ల బండ్లపై సమ్మక్క-సారక్క అమ్మ వార్లను దర్శించుకోవడానికి వొస్తున్న భక్తులను మేడారం జాతరలో సందర్భంగా తీసిన ఫోటోకి కన్సోలేషన్ బహుమతి దక్కింది.
ఫోటో జర్నలిస్టులని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యం:
ఫోటో జర్నలిస్టులలో దాగి ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు TSPJA రాష్ట్ర అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కేఎన్ హరి తెలిపారు. ప్రముఖ సంపాదకులు దేవులపల్లి అమర్, తెలంగాణకు చెందిన ఛాయాగ్రాహకుడు-నటుడు కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు కమల సుధాకర్ రెడ్డిలతో కూడిన జ్యూరీ బృందం విజేతలను ఎంపిక చేసింది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో విజేతల వివరాలను వెల్లడించి.. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 10 మందికి కన్సోలేషన్ అవార్డులను ప్రకటించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 19వ తేదీన బషీర్‌బాగ్‌లోని ప్రెస్ క్లబ్ లో రాష్ట్రస్థాయి ఉత్తర వార్త చిత్రాలని ప్రదర్శించడంతో పాటు.. తొందరలోనే విజేతలకు బహుమతులని ప్రధానం చేయబోతున్నట్లు TSPJA వెల్లడించింది.
