అన్నమయ్య జిల్లాలో పుష్ప సినిమా రేంజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ప్లాన్ చేసి అడ్డంగా బుక్కయ్యారు దుండగులు. ట్రాక్టర్ ట్యాంకర్ లో రూ. కోటి 65 లక్షల విలువజేసే 72 ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాక్టర్ ని సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా టీ. సుండుపల్లె మండలంలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సుండుపల్లె మండలం పించా ప్రాజక్టు దగ్గర ట్రాక్టర్ ట్యాంకర్ లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు.
టీ. సుండుపల్లి మండలం పించా ప్రాజెక్ట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక ట్రాక్టర్ ట్యాంకర్ లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తున్నట్లు గుర్తించామని.. వారిని వెంబడించి నలుగురిని పట్టుకోగా మిగిలిన వారు పారిపోయినట్లు తెలిపారు పోలీసులు. నలుగురు నిందితులతో పాటు ట్రాక్టర్ లో లోడ్ చేసిన 72 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
పట్టుబడ్డ నలుగురు నిందితులను విచారించగా ఇద్దరు తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కు చెందినవారిగా..మరో ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 72 ఎర్రచందం దుంగల విలువ సుమారు 1.65 కోట్లు గా ఉంటుందని తెలిపారు పోలీసులు.
