భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం: భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ సదస్సులో సీఎం చంద్రబాబు

భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం: భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ సదస్సులో సీఎం చంద్రబాబు

భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సుకు  శుక్రవారం (డిసెంబర్ 26) హాజరైన ఆయన.. సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారని కొనియాడారు. మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక అని అన్నారు. 

ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందన్నారు. ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత ద్వారా చాటి చెప్పాం.. యోగ, ఆయుర్వేదం  రెండు వేల ఏళ్ల క్రితేమ ప్రపంచానికి పరిచయం చేశాం. తక్షశిల, నలంద యూనివర్శిటీల ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘనత మనది... జీరోను భారతీయులే కనుగొన్నారు. మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదే. అస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప వారున్నారని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు.

2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్:

భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు... భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందని కొనియాడారు సీఎం చంద్రబాబు.  అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాల్లో 2 వేల ఏళ్ల క్రితం భారత దేశానికంటే ఎంతో వెనుకబడి ఉన్నాయి. 2 వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే భారత దేశం 40 శాతం జీడీపీని కలిగి.. సూపర్ పవర్ గా ఉన్న భారత్.. విదేశీ పాలనతో ఇబ్బంది పడిందని తెలిపారు.

►ALSO READ | సునామీకి 21 ఏళ్లు ! విశాఖ తీరంలో మహిళల ప్రత్యేక పూజలు

1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత ఐటీ రెవల్యూషన్ అందిపుచుకున్నామని తెలిపారు. వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలకు భారతీయులే ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం అన్నారు. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  భారతదేశం నెంబర్-1 స్థానంలోకి వెళ్లనున్న సందర్భంలోనే పేద-ధనిక మధ్య అంతరాలు తగ్గే వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఏపీ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు:

క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. టెలికాం సంస్కరణలతో కనెక్టివిటీ పెరిగిందని చెప్పారు. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎయిరో స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్ టెక్ పార్క్ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రాంతాల వారీగా ఏయే రంగాల్లో అభివృద్ధి చేయవచ్చో ప్రణాళికలు వేసుకుని రూపొందించామని తెలిపారు. ఈ సందర్భంగా ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, ప్రొఫెసర్ భారత్, డాక్టర్ సతీష్ రెడ్డి, సంస్కృత విద్యాపీఠం కులపతి జిఎస్ఆర్కే శాస్త్రి పాల్గొన్నారు.