T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో హైటెన్షన్ మ్యాచ్ రేపు (ఫిబ్రవరి 15న) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. గత కొన్ని వారాలుగా నెలకొన్న వివాదాల అనంతరం ఇరు జట్లు ఈ మ్యాచ్ ఆడబోతున్నాయి. భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్థాన్ ఢాకాకు మద్దతు తెలిపింది. రేపు భారత్‌తో ఆడేందుకు పాక్ సర్కార్ అనుమతి ఇవ్వలేదనే వార్తలు వచ్చాయి. దీంతో పలు దఫాల్లో జరిగిన చర్చల తర్వాత చివరికి దాయాది టీం టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకు 8 సార్లు పోటీ పడ్డాయి. అందులో భారత్ ఏడు సార్లు విజయం సాధించగా, పాకిస్థాన్ మాత్రం ఒక్కసారే గెలిచింది.‘మెన్ ఇన్ గ్రీన్’పై దాదాపు మెన్ ఇన్ బ్లూ ఆధిపత్యం చూపించింది. మరోసారి ఈ చరిత్రను తిరగ రాయాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతుంది.
ALSO READ : ఐర్లాండ్ అదరగొట్టింది.. ఒమన్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది..!
భారత్ ప్రస్తుతం తన గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించింది. 3.05 నెట్ రన్‌రేట్‌తో ఇతర జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉంది. అలాగే, సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు కూడా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో నిలిచింది. ఈ హై వోల్టేజ్ పోరులో గెలిచిన జట్టు సూపర్-8కు చేరుకునే అవకాశాలు దాదాపు ఖాయం కానున్నాయి. దీంతో కొలంబోలో జరిగే ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
