Seetha Payanam Review : యాక్షన్ కింగ్ మార్క్ ఫ్యామిలీ డ్రామా.. ‘సీతా పయనం’ ఎలా ఉందంటే?

Seetha Payanam Review : యాక్షన్ కింగ్ మార్క్ ఫ్యామిలీ డ్రామా.. ‘సీతా పయనం’ ఎలా ఉందంటే?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న  నటుడు అర్జున్ సర్జా. కేవలం ఒక నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను అందించడంలో ఆయన రూటే వేరు. లేటెస్ట్ గా తన వారపురాలు ఐశ్వర్య అర్జున్ ను  వెండితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతా పయనం'  ఈ మూవీని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ( ఫిబ్రవరి 14 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి అర్జున్ స్వయంగా దర్శకత్వం వహించారు. ప్రేమకథగానే కాకుండా, కుటుంబ విలువల కలబోతగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా..? దర్శకుడుగా అర్జున్ సఫలమైయ్యారా అనేది చూద్దాం..

కథా నేపథ్యం..

వైజాగ్‌లో నివసించే సీత (ఐశ్వర్య అర్జున్)కు తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ (సత్య రాజ్) అంటే ప్రాణం. తండ్రికి కూడా కూతురే లోకం. ఒక ఆధునిక భావాలు గల అమ్మాయి అయినప్పటికీ.. సంప్రదాయలకు ప్రాణమిస్తుంది. అయితే  పెళ్లి పట్ల ఆసక్తి లేని సీత, ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా దాటవేస్తుంటుంది. తన కెరీర్ ను చక్కదిద్దుకునే క్రమంలో ఒక వర్క్ షాప్ కోసం ఆమె వైజాగ్ నుండి హైదరాబాద్‌కు ప్రయాణమవుతుంది.  ఈ ప్రయాణంలో ఆమెకు అభి ( నిరంజన్ ) అనే యువకుడు పరిచయం అవుతాడు.   వీరిద్దరి మధ్య సాగే ప్రయాణం కేవలం గమ్యాన్ని చేరడమే కాకుండా, జీవితంలోని విలువలను, బంధాలలోని గొప్పతనాన్ని సీతకు ఎలా గుర్తు చేసింది? అసలు అభి ఎవరు? వీరిద్దరి జీవితాల్లోకి గిరి (అర్జున్) , బసవన్న (ధృవ్ సర్జా) పాత్రలు ఎలా ప్రవేశించాయి? చివరికి సీత తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుందా? అనేదే ఈ చిత్ర అసలు కథ

నటీనటుల పనితీరు

తొలి సినిమా అయినా సీత పాత్రలో ఐశ్వర్య ఎంతో హుందాగా నటించారు.  ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. ఆ పాత్రకు కావాల్సిన పవిత్రతను ఆమె తన నటనతో తీసుకొచ్చారు. 'సీత' పాత్రలో ఆమె చూపించిన హుందాతనం, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తండ్రి పట్ల చూపే అనురాగం వెండితెరపై పండాయి . నటుడు నిరంజన్ తన పరిధి మేరకు సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు.   ఐశ్వర్యతో అతని కెమిస్ట్రీ సహజంగా ఉంది.

సత్య రాజ్, ప్రకాష్ రాజ్ అనుభవం ఉన్న నటులుగా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తండ్రి పాత్రలో సత్య రాజ్ నటన భావోద్వేగాలకు గురిచేసి కన్నీళ్లు పెట్టించారని ప్రేక్షకులు కొనియాడుతున్నారు.. ఈ దిగ్గజ నటులు తమ అనుభవంతో సినిమా స్థాయిని మరింత పెంచేశారు. అర్జున్ , ధృవ్ సర్జాల ఎంట్రీలు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. బిత్తిరి సత్తి, కోవై సరళ తమ కామెడీతో ఆహ్లాదాన్ని పంచారు.

అర్జున్ దర్శకత్వ ప్రతిభ

దర్శకుడుగా అర్జున్ ఈ సారి ఒక  విభిన్నమైన కథను ఎంచుకున్నారు. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఆయన ఒక సున్నితమైన  కటుంబ కథను ఎంచుకోవడం సాహసమే..  అర్జున్ ఒక తండ్రిగా తన కూతురికి ఇవ్వగలిగిన అత్యుత్తమ బహుమతి ఈ సినిమా చెప్పుకొవచ్చు. ‘సీత’ పాత్రను కేవలం ఒక హీరోయిన్‌లా కాకుండా, భారతీయ సంస్కృతికి, ధర్మానికి ప్రతీకగా ఆయన తీర్చిదిద్దారు. కథ పాతదే అయినా, దానిని నడిపించిన విధానం,  అందులో పొందుపరిచిన విలువలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా గో రక్షణపై తీసిన సన్నివేశాలు గుండెలను హత్తుకుంటాయి. మూగజీవాల పట్ల హింస తగదని, మానవత్వం , బంధాల ప్రాముఖ్యతను అర్జున్ తనదైన శైలిలో వివరించారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.. 

సాంకేతిక విభాగం

అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణవాయువు. పాటలు వినసొంపుగా ఉండటమే కాకుండా, నేపథ్య సంగీతం సన్నివేశాలలోని లోతును పెంచింది. విజువల్స్ చాలా సహజంగా ఉన్నాయి. ఎడిటింగ్ లోపాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ గౌరవాన్ని ఈ చిత్రం నిలబెట్టింది.

అశ్లీలతకు తావులేకుండా, కుటుంబం అంతా కలిసి చూడదగ్గ ఒక గొప్ప విలువలతో కూడిన చిత్రం ‘సీతా పయనం’. క్లైమాక్స్ లో తండ్రీ-కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తాయి. కొన్ని చోట్ల కథనం నెమ్మదించినట్లు అనిపించినా, సినిమా ఇచ్చే సందేశం ఆ లోటును భర్తీ చేస్తుంది. సంప్రదాయాలను ప్రేమిస్తూ, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం ఇది అంటున్నారు సినీ ప్రియులు.