T20 World Cup: ఢిల్లీ నుంచి శ్రీలంక టికెట్ లక్ష రూపాయలా.. మామూలు రోజుల్లో 10 మంది వెళ్లొచ్చు..!

T20 World Cup: ఢిల్లీ నుంచి శ్రీలంక టికెట్ లక్ష రూపాయలా.. మామూలు రోజుల్లో 10 మంది వెళ్లొచ్చు..!

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో రేపు (ఫిబ్రవరి 15న) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న టీమిండియా, సల్మాన్ అలీ అఘా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టుతో తలపడే మ్యాచ్‌కు భారీ హైప్ నెలకొంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రభావం విమాన టికెట్ ధరలపై కూడా పడింది.  

సాధారణంగా ఢిల్లీ నుంచి కొలంబోకు విమాన టికెట్ ధర రూ.16 వేల నుంచి రూ.17 వేల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ కారణంగా ఫ్లైట్ ధరలు దాదాపు 500 శాతం పెరిగి, ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.1,10,000కు చేరుకోగా.. బిజినెస్ క్లాస్ టికెట్ల ధరలు,  దాదాపు రూ.2 లక్షల వరకు పెరిగాయి. మ్యాచ్ దగ్గరపడుతున్న కొద్దీ ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. రేపు జరగనున్న ఈ మ్యాచ్‌కు 35 వేల సీట్ల సామర్థ్యం కలిగిన స్టేడియం పూర్తిగా హౌస్‌ఫుల్ అయిపోయింది. అన్ని టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. భారత, పాకిస్థాన్ జట్లు వేర్వేరు హోటళ్లలో బస చేస్తున్నట్లు తెలుస్తుంది. స్టేడియం చుట్టుపక్కల ఉన్న హోటళ్లు కూడా మొత్తం బుక్ అయ్యాయి.

గ్రూప్-Aలో భాగంగా జరుగుతున్న భారత్– పాకిస్థాన్ మ్యాచ్ విలువ సుమారు 250 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఐసీసీ టోర్నీల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై భారత్ గెలిచిన విషయం తెలిసిందే. అందుకే, ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. క్రికెట్‌లో ఏ క్షణంలోనైనా పరిస్థితులు మారిపోతాయి. గత రికార్డులు, ఫేవరెట్ ట్యాగ్‌లు ఫలితాన్ని నిర్ణయించవు.. ఈ మెగా ఈవెంట్ లో భారత్ ఇప్పటికే యూఎస్ఏ, నమీబియాపై విజయం సాధించింది. పాక్ మాత్రం తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్, అమెరికాపై విజయం సాధించింది. రేపు కొలంబోలో జరిగే భారత్– పాకిస్థాన్ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ 6:30కి పడుతుంది.