నెలకు రూ.2 లక్షలు జీతం చాలట్లే.. అన్నీ అప్పులే.. నెట్టింట సలహాలు కోరిన 27 ఏళ్ల టెక్కీ

నెలకు రూ.2 లక్షలు జీతం చాలట్లే.. అన్నీ అప్పులే.. నెట్టింట సలహాలు కోరిన 27 ఏళ్ల టెక్కీ

నెలకు లక్షల రూపాయల జీతం వస్తే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చాలామంది భావిస్తారు. కానీ పెరుగుతున్న లైఫ్ స్టైల్ ఖర్చులు, పెరుగుతున్న అప్పులు, ఈఎంఐల భారం కారణంగా అధిక ఆదాయం ఉన్నవారు కూడా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తాజాగా 27 ఏళ్ల ఓ ఐటీ ఉద్యోగి తన ఆర్థిక పరిస్థితిని రెడ్డిట్‌లో పంచుకోవడంతో డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ.. తాను ప్రతి నెలా జీతం కోసం ఎదురుచూస్తూ బతుకుతున్నానని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని వాపోయాడు సదరు యువ టెక్కీ.

గత ఏడాది కాలంలో జీవితంలో అనేక మార్పులు ఒకేసారి వచ్చాయన్నాడు కుర్ర టెక్కీ. వివాహం, కుటుంబ అవసరాల కోసం చేసిన భారీ ఖర్చులు, భార్యతో కలిసి కొత్త నగరానికి మారడం అతడి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపాయట. కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకునేందుకు అద్దె, ఫర్నిచర్, గృహోపకరణాలు, డిపాజిట్లు వంటి ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువయ్యాయని చెప్పాడు. ఇదే సమయంలో అతడి భార్య ఉద్యోగం కోల్పోవడంతో మొత్తం భారం ఒకే ఆదాయంపై పడిందని వెల్లడించాడు.

తన అప్పుల వివరాలను కూడా అతడు వెల్లడించాడు. బంధువుల నుంచి తీసుకున్న రూ.20 లక్షల అప్పుకు నెలకు రూ.25 వేల చెల్లిస్తున్నట్లు తెలిపాడు. దీనికి తోడు పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లింపునకు మరో రూ.25 వేలు, క్రెడిట్ కార్డు ఈఎంఐల రూపంలో రూ.30 వేలు చెల్లిస్తున్నానని చెప్పాడు. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ తీసుకోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే ఎమర్జెన్సీ ఫండ్ కూడా మిగలలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకేసారి వచ్చిన ఖర్చులను ఎదుర్కొనేందుకు ఎక్కువగా ఈఎంఐలపై ఆధారపడటం తన తప్పేనని అంగీకరించాడు.

ALSO READ : కేవైసీ ప్రక్రియలో కీలక మార్పు..

తనలాంటి పరిస్థితిలో ఉన్నవారు బయటపడేందుకు ఏం చేయాలో సూచించాలని కోరుతూ.. రాబోయే రెండు మూడేళ్లలో ఆర్థికంగా కోలుకునేందుకు ప్లాన్ చెప్పాలని రెడ్డిట్ యూజర్లను అడిగాడు. దీనికి పలువురు ప్రాక్టికల్ సలహాలు ఇచ్చారు. అదనపు ఆదాయం కోసం ఫ్రీలాన్స్ పనులు చేయడం, ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం, తర్వాత అప్పులను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఘటన ద్వారా అధిక జీతం ఉన్నప్పటికీ సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అప్పుల ఒత్తిడి తప్పదనే విషయం మరోసారి రుజువైంది.