- వైభవ్ పైనే అందరి దృష్టి
- గెలుపే లక్ష్యంగా జింబాబ్వే
- సా. 4.30 నుంచి యునైటె 8 స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ యాప్‌లో లైవ్
హరారే: తొలి మ్యాచ్‌లో గెలిచి జోరుమీదున్న ఇండియా.. జింబాబ్వేతో రెండో పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి ఇక్కడే సిరీస్ పట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో తొలి విజయం నమోదు చేసిన టీమిండియా అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది.
వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ టూర్‌లో షార్ట్ బాల్స్‌కు బాగా ఇబ్బందిపడ్డ వైభవ్ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాడు. రెండో ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకా గాడిలో పడాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో ఓ చెత్త బాల్‌కు ఔట్ కావడంతో ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని యోచిస్తున్నాడు.
వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడుతుండటం కలిసొచ్చే అంశం. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ హిట్టింగ్‌ను కొనసాగిస్తే భారీ స్కోరు ఖాయం. అయితే బ్యాటర్ల బలమైన పెర్ఫామెన్స్ కంటే బౌలర్ల సమష్టి కృషి మేనేజ్‌మెంట్‌కు సంతృప్తినిస్తోంది. ఈ సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండటంతో ప్లేయర్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు.
అలాగే గ్రౌండ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడటంతో ప్రత్యర్థి బ్యాటర్లను సులువుగా ఇబ్బందుల్లో పడేస్తున్నారు. పేసర్లు మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ వికెట్లతో పాటు రన్స్ కట్టడి చేయడం కాన్ఫిడెన్స్ పెంచే అంశం. డెబ్యూ బౌలర్ అశోక్ శర్మ వికెట్లు తీయలేకపోయినా మంచి లైన్ అండ్ లెంగ్త్, స్పీడ్‌తో బౌలింగ్ చేశాడు.
లెక్క సరిచేయాలని..
తొలి మ్యాచ్‌లో ఓడిన జింబాబ్వే ఈ మ్యాచ్‌పై ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆరంభంలో వైభవ్‌ను కట్టడి చేయడంపై బౌలర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు. దీనికి తోడు పవర్‌ప్లేలో ఇండియా బౌలర్ల వేగాన్ని తట్టుకోలేక ఎక్కువగా వికెట్లు చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో వికెట్లు కాపాడుకోవాలని భావిస్తోంది.
తొలి మ్యాచ్‌లో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన జింబాబ్వేకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఈ మ్యాచ్‌లో ఒకటి, రెండు మార్పులు చేసే చాన్స్ ఉంది. న్యూమాన్ నైమురి ప్లేస్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ మసకద్జాను తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో బ్రియాన్ బెన్నెట్, బెన్ కరన్, డియాన్ మేయర్స్, సికిందర్ రజా గాడిలో పడితే మంచి స్కోరును ఆశించొచ్చు.
జట్లు (అంచనా)
ఇండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ.
జింబాబ్వే: సికిందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, బెన్ కరన్, డియాన్ మేయర్స్, రైన్ బర్ల్, వెస్లీ మదెవరె, తడివాన్షే మరుమణి, బ్రాడ్ ఇవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా / న్యూమాన్ నైమురి, రిచర్డ్ ఎంగ్రావ, బ్లెస్సింగ్ ముజరబాని.
పిచ్, వాతావరణం
* తొలి టీ20 మాదిరిగానే ఈ మ్యాచ్‌లోనూ పిచ్ పేసర్లకు అనుకూలం. ప్రారంభంలో తేమ కారణంగా బ్యాటర్లు బంతిని హిట్ చేయడం కొద్దిగా కష్టం. వర్షం ముప్పు లేదు.
* ఈ మ్యాచ్‌లో శ్రేయస్ టాస్ గెలిస్తే, కెప్టెన్‌గా తన తొలి 9 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లోనూ టాస్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో వాలీ హమ్మండ్ (ఇంగ్లండ్) రికార్డును అధిగమిస్తాడు.
