పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆసుపత్రిలోని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో రూ.3 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన హార్ట్ లంగ్ మెషీన్‌ను శుక్రవారం టీజీఎంఎస్ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రారంభించారు.
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు అవసరమయ్యే రోగులకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ అత్యాధునిక యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాణి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇందిర, సీటీ సర్జరీ హెచ్వోడీ రవీంద్ర, డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.
హార్ట్-లంగ్స్ మెషీన్ ఇలా పనిచేస్తుంది..
ఓపెన్ హార్ట్ సర్జరీ సమయంలో గుండె, ఊపిరితిత్తుల విధులను హార్ట్- లంగ్ మెషీన్ నిర్వహిస్తుంది. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సప్లై చేయడంతో పాటు, రక్తాన్ని శుద్ధి చేసే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది.
సాధారణంగా గుండె కవాటాల మార్పిడి(వాల్వ్ రీప్లేస్‌మెంట్), పుట్టుకతో వచ్చే గుండె రంధ్రాలు, లోపాలను సరిదిద్దడం వంటి క్లిష్టమైన చికిత్సల కోసం ఈ మెషీన్ ఉపయోగపడుతుందని డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ తెలిపారు.
