ప్రధాని ఒక వీడియో వదలడం.. తత్తరపాటుకు సంకేతాలే.. ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్స్తో లొంగదీసుకుందామంటే..

ప్రధాని ఒక వీడియో వదలడం.. తత్తరపాటుకు సంకేతాలే.. ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్స్తో లొంగదీసుకుందామంటే..

‘తన దాకా వస్తేగాని తత్వం బోధపడలేదు’ అన్నట్టు అర్ధరాత్రి ప్రధాని మోదీ స్పందించారు. జవాబుదారీతనం కోరుతూ ఇన్నాళ్లూ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌‌‌‌ వైపు ఎత్తిపెట్టిన వేళ్లు.. ఢిల్లీ పోలీసు దాష్టీకాలు,  నిర‌‌‌‌స‌‌‌‌న‌‌‌‌ చేస్తున్న యువతపై అమానుష దాడి,  హింస తర్వాత ఏకంగా కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపు మళ్లాయి.

అందుకేనేమో ‘అధికారం తలకెక్కకూడదు’ అంటారు. ఇన్నాళ్లూ చేసిన, చేస్తున్న బెట్టు వీడి ఒక్కసారిగా పట్టు సడలింపులు, సెట్లకు సెట్లు కీలక నిర్ణయాల దారి పట్టింది కేంద్ర ప్రభుత్వం.  చర్చలకు ఓకే,  సంప్రదింపులకూ సరే,  ఫాస్ట్‌‌‌‌ట్రాక్ కోర్టులు,  ప్రత్యేక చట్టానికి బిల్లు, ఉన్నతాధికారి బదిలీ... ఇవన్నీ  ముందే చేస్తే  నేల నెత్తురుతో తడిసేది కాదుగా!

ప్రజాస్వామ్యపు పద్ధతులకు, సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ, ‘మేం ఏం చేసినా చెల్లుబాటవుతుంది’ అనే ధిక్కార ధోరణే... మొన్న మూడు వ్యవసాయ చట్టాలను ఏడాది దాష్టీకాల తర్వాత వెనక్కి తీసుకోవడమైనా, నిన్న  నిర్హేతుకంగా  నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టి కడకు  బిల్లు వీగేలా చేతులు కాల్చుకోవడమైనా,  ఇవాళ పరీక్షా పేపర్ల లీక్‌‌‌‌లు తప్పే.. అందుకు చర్యలు తీసుకుంటామని చివరకు అంగీకరించడమైనా!  జాప్యం అనుచితం.  ఈ లోపున  ప్రజాస్వామ్యం  పరాభవానికి  గురికావడమే  కాకుండా  ప్రమాదంలో పడుతోంది.

కేంద్ర విద్య,- మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌ రాజీనామా కోరుతూ యువత జరిపిన నిరసనపై జరిగిన లాఠీఛార్జి,  దాడి పైన సమగ్ర విచారణ  యావత్  భారత్  కోరుతోంది.  అంత ఉవ్వెత్తున లేచిన యువత ఆలోచనల్ని,  మనోభావాల్ని  ఉద్విగ్నతల్ని నిర్ధాక్షిణ్యంగా అణచివేత ద్వారా  కాలరాయాలని చూడటం ఏ ప్రజాస్వామ్య పాలకులకూ మంచిది కాదు.  ఎప్పుడో  చర్చలు జరిపి ఉండాల్సింది.  అన్ని ద్వారాలూ తట్టి  చివరి యత్నంగా  న్యాయస్థానానికి  వెళితే  అక్కడ వారికెదురైన  అనుభవం ఎంతో  చేదైనది. భారత న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి,  ఔన్నత్యానికి  కళంకం  తెచ్చేదిగా ఉందా పరిణామం.  ప్రజాస్వామ్యంలో  ఇది  తగదన్నది  సగటు మనిషి భావన.

ఆత్మలు ఘోషిస్తాయి
ఎవరి అనుచిత, అవాంఛనీయ వ్యాఖ్యల ఫలితంగా ‘కాక్రోచ్ ఉద్యమం’  పుట్టి, పెరిగి, దావానలంలా వ్యాపించిందో వారే ‘న్యాయ నిరాకరణ’ను  తెలియజేయడం విధి వైచిత్రి తప్ప విస్మయం కలిగించదు.  కాకపోతే, పిటిషన్ విచారణ సందర్భంగా  దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు జనావళికి ఆందోళన కలిగించాయి.  సగటు మనిషి విశ్వాసాన్ని సన్నగిల్లజేశాయి. శాంతియుత నిరసనకారులైన విద్యార్థులపై ఢిల్లీ పురవీధుల్లో పోలీసులు, సివిల్ దుస్తుల్లో ఉన్న ‘గుర్తు’ తెలియని వ్యక్తులు జరిపిన పాశవిక దాడుల్ని,  నేల చిందిన నెత్తుటిని వందలు,  వేల వీడియో క్లిప్పుల్లో  దేశమంతా సజల న‌‌‌‌య‌‌‌‌నాల‌‌‌‌తో చూసింది. కానీ,  సర్వోన్నత న్యాయస్థానపు పీఠాధిపతులు మాత్రం.... ‘మేం చూడం, మాకు అవి చూసే ఆసక్తి లేదు, సమయమూ లేదు’ అన్న ములుకుల వంటి పలుకులు జాతి గుండె జారిపోయేలా చేశాయి.

చచ్చి ఏ లోకాన ఉన్నారో..  జస్టిస్ కృష్ణ అయ్యర్,  జస్టిస్ భగవతి వంటి వారి ఆత్మలు ఈ మాటలు వింటే  వ్యధతో తప్పక ఘోషిస్తాయి.  ప్రస్తుత ధర్మాసనంలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గత మే నెలలో ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలతోనే  ‘అవును,  మేం  కాక్రోచ్‌‌‌‌లమే’ అంటూ దేశ యువ‌‌‌‌త ఉద్యమించింది. తానలా అనలేదని, తన వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందని సీజేఐ తదుపరి వివరణ ఇచ్చారు. ‘కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా వచ్చినవారు,  కేసులు లేనివారు, విద్యా విఫలురు వ్యవస్థలపై బడి ‘పరాన్న బుక్కులు’గా,  ‘కాక్రోచ్‌‌‌‌’లుగా  బతుకుతున్నారని వ్యాఖ్యానించినట్లు చెప్పారు.

మరి, అలా వచ్చినవారు  సుప్రీంకోర్టు బార్‌‌‌‌లో,  వివిధ  హైకోర్టుల బార్‌‌‌‌‌‌‌‌లలో  ఎందరున్నారో  తగిన  విచారణకు సీజేఐ ఆదేశించలేదు.  పోనీ, అటువంటి ఫేక్‌‌‌‌ సర్టిఫికెట్లు ఇస్తున్న వ్యక్తులెవరు?  సంస్థలేవి?  విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్నయినా  పురమాయించలేదు.   ప్రస్తుత విద్యార్థులు, యువతరం ఉద్యమం అదే!  ప్రవేశపరీక్షల విధానం, విద్యావిధానం సరిచేయమని,   మంత్రి తప్పుకోవాలని, లేదా తప్పించమని నిరసనకారులు కోరుతున్నారు.  అటువంటిది, వారి ఉద్యమాన్ని లెక్కించబోమన్నట్టు వీడియోను చూడమంటే ఎట్లా?

ఇది ద్వైపాక్షిక అంశం కాదు
గడిచిన  పదేళ్ల కాలంలో దేశంలో 152 పేపర్‌‌‌‌ లీకులు జరిగాయని, కనీసం ఒక్కరికైనా శిక్ష పడలేదని ప్రతిపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌‌‌‌గాంధీ ఆరోపిస్తున్నారు. బాధ్యత, -జవాబుదారీతనం ఉండొద్దా అన్నది ఆయన ప్రశ్న. రాహుల్‌‌‌‌గాంధీ  పక్షపాతంగా ఉన్నారని,  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీకుల సంగతేంటి?  అని  బీజేపీ నేత,  కేంద్రమంత్రి నడ్డా అంటున్నారు.  అవి  ఏమిటి?  ఎందుకు?  ఎలా జరిగాయి అన్నది ఎవరైనా ప్రశ్నించవచ్చు, ప్రశ్నించాలి కూడా?  

అలా  ప్రశ్నించాలంటే  కేంద్రంలోని  తన  సహచరమంత్రి  ధర్మేంద్ర ప్రధాన్,  పలు బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు కూడా దేశంలో,  అంటే  ఆయా రాష్ట్రాల్లో  జరిగిన  పేపర్ లీకులకు బాధ్యత వహించి మాట్లాడాల్సి ఉంటుంది.  అది రాహుల్ గాంధీకైనా అదేరీతిలో వర్తిస్తుంది. మౌనంగా ఉందాం, ‘నీ వీపుకి నేను.. నా వీపుకి నీవు శ్రీరామరక్ష’ అనుకోవడానికి ఇదేం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ద్వైపాక్షిక అంశం కాదు.

దేశం మొత్తానికి  చెందిన  విద్యార్థులు,  యువత,  నిరుద్యోగులు వారి తల్లిదండ్రులకు సంబంధించిన అంశం.  మన  విద్యావ్యవస్థ.  ఉద్యోగ, -ఉపాధి అవకాశాల  కల్పనకు  సంబంధించిన  కీలకాంశమిది.  కాక్రోచ్ పార్టీగాని, వారి నిరసన - డిమాండ్లుగాని,  దేశ రాజధానిలో - ఏకకాలంలో  వివిధ రాష్ట్రాల్లోగానీ పెద్ద ఎత్తున  పెల్లుబికిన నిరసనోద్యమాన్ని పేపర్‌‌‌‌ లీకులు - మంత్రి రాజీనామా అన్న పరిమిత దృష్టితో చూడలేం.  దేశ జనాభాలో 60 శాతం దాకా ఉన్న యువతరం,   వారిపై  ఆధారపడ్డ  మొత్తం  కుటుంబీకుల సమస్యగా  పరిగణించి చూడాల్సిందే!   ‘నీట్‌‌‌‌’ టాపర్‌‌‌‌  ఆర్యన్ గుప్తా చెప్పినట్లు  ‘నిరసన తెలపడం, లోపాల మీద, పాలకుల తప్పులపైన  విమర్శలు  చేయడం పౌరులకు రాజ్యాంగం  కల్పించిన హక్కు.

తప్పుల్ని హుందాగా అంగీకరించాలి
ఒక రైలు దుర్ఘటనకు  నైతిక బాధ్యత వహిస్తూ  ఆనాడు మంత్రిగా ఉన్న లాల్‌‌‌‌బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారంటే,   ఆయనే ఆ దుర్ఘటనకు  కారకుడని కాదు.  ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన వ్యవస్థకు నేతృత్వం వహిస్తున్న నేత  నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు.  ప్రస్తుత ప్రభుత్వాలు కనీసం బాధ్యతను అంగీకరించడానికి,  తప్పిదాల్ని ఒప్పుకోవడానికి,  నైతిక  జవాబుదారీతనానికి సిద్ధంగా లేవే? 

పైగా  నిరసనల్ని,  ఆందోళనల్ని, ఉద్యమాల్ని  తగు చర్చలు,  సంప్రదింపుల ద్వారా  సద్దుమణిగేలా చేయడం కాకుండా  కర్కశంగా అణచివేయడానికే  ప్రయత్నిస్తున్నాయి.  నిన్నా ఇవాల్టి ఉద్యమం ప్రభావమే లేదంటారు.  మరోవైపు 1.5 కిలోమీటర్ల పరిధిలో ‘ఇంటర్‌‌‌‌నెట్‌‌‌‌’ నిలిపివేశారు. 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు.  మొత్తం కన్నాట్ ప్లేస్‌‌‌‌కే  మూత!  అంటే,  జీవితం  బహుముఖీనం అయిన ఈ రోజుల్లో సగటు పౌరుల జీవితాన్ని ఎంతగా నలతకు గురిచేసినట్టు లెక్క!  ఏలిన వారికి ఇవేవీ పట్టట్లేదు.  తమకు తోచింది తోచినట్లు చేయడమే వారి పని.

యువత నైతిక విజయం
నిరసనకారులైన విద్యార్థులు, యువతది  ఒకరకంగా  నైతిక విజయమే.  యువత తమ రక్తం ఒడ్డి  గెలిచారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఉద్యమాన్ని అణచివేసి, ఆధిపత్యం సాధించడానికి అవకాశం లేకపోయింది. ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్స్ వంటివి చేసి లొంగదీసుకునే వీలు లేకుండా వాళ్లు కేవలం విద్యార్థులైపోయారు! లేకుంటే పరిస్థితి  మరెలా ఉండేదో ?

ప్రధానమంత్రి  ఒక ట్వీట్ చేసి, రీట్వీట్ చేయాల్సిందిగా ఎన్డీయే  మిత్రపక్షాల వారందరినీ కోరడం, ఒక రోజులో రెండుసార్లు, అదీ అర్ధరాత్రి  దాటాక  దేశ ప్రజలపైకి ప్రధాని ఒక వీడియో సందేశం వదలడం... ఇవన్నీ వారి తత్తరపాటుకు సంకేతాలే! జరిగిన తప్పిదాన్ని  అంగీకరించి,  జరగాల్సిన,  బిల్లు వంటి భవిష్యత్ కార్యాచరణకు ముందే సిద్ధపడి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదన్నది జనాభిప్రాయం. ప్రజల ఆలోచనల్ని  గౌరవించడం,  వారికి  ఏది మంచో  అదే చేయడం  ప్రజాస్వామ్యంలో పాలకుల ప్రథమ కర్తవ్యం.

దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్

 

* ఓపెన్​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.