- ప్రధాని మోదీ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే కేటాయించిన ఢిల్లీ హైకోర్టు
- పాత, పెండింగ్ కేసులన్నీ కొత్త కోర్టుకు బదిలీ చేయాలని ఆర్డర్
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, ఇతర అక్రమాలకు సంబంధించిన క్రిమినల్ కేసులను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు ఓ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ పరిధిలో పనిచేసే జుడీషియల్ ఆఫీసర్ అను గ్రోవర్ బాలిగా కోర్టును ‘ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు’గా నోటిఫై చేస్తూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అరుణ్ భరద్వాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కోర్టు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024’ (కఠినమైన పరీక్షల అక్రమ నిరోధక చట్టం) కింద నమోదయ్యే కేసులు, దానికి అనుబంధ నేరాలను మాత్రమే ప్రత్యేకంగా విచారిస్తుందని పేర్కొన్నారు. ఈ చట్టం కింద నమోదైన పాత, పెండింగ్ కేసులన్నింటినీ తక్షణమే ఈ కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి బాలిగా ఇంతకుముందు తీస్ హజారీ కోర్టులలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ మధ్యవర్తిత్వ కేంద్రానికి ఇన్‌చార్జ్ న్యాయమూర్తిగా పనిచేశారు.
సీజేపీ నిరసనలపై ఎన్ఐఏ విచారణకు పిల్..
ఈ నెల 20న ఢిల్లీలో జరిగిన కాక్రోచ్జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు, పార్లమెంట్ మార్చ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన పిటిషన్ (పిల్)ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. పిల్‌ను హైకోర్టు పక్కన పెట్టింది.
ఈ పిల్‌పై చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్ఐఏ విచారణకు ఉత్తర్వులు జారీ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, కోర్టు పరిధిలోనిది కాదని స్పష్టం చేసింది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్‌ను పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించారు.
నీట్ లీక్ కేసు నిందితుడికి బెయిల్ పిటిషన్ రిజెక్ట్
నీట్‌పేపర్ లీక్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ డాక్టర్ సమర్పించిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ మేరకు నిందితులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాత్రింబవళ్లు కష్టపడి, తమ ప్రతిభా నైపుణ్యాలతో పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల నమ్మకాన్ని వీరి అసహ్యకరమైన, చట్టవిరుద్ధమైన చర్యలు దెబ్బతీశాయని వ్యాఖ్యానించింది.
