10 శాతం టారిఫ్తో నో టెన్షన్.. యూఎస్ తాజా టారిఫ్స్పై FIEO

10 శాతం టారిఫ్తో నో టెన్షన్.. యూఎస్ తాజా టారిఫ్స్పై FIEO
  • పోటీ దేశాలపై మరింత సుంకం
  • తక్కువ ధరలకే అమెరికాలో భారతీయ వస్తువులు
  • మన ఎగుమతిదారులకు మేలే

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం సెక్షన్ 301 ప్రకారం తాజాగా విధించిన 10 శాతం టారిఫ్ వల్ల భారతీయ ఎగుమతిదారులకు నష్టం లేదని, ప్రయోజనాలే ఉంటాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్​పోర్ట్స్​ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) స్పష్టం చేసింది.  పోటీ దేశాలు ఇండియా కంటే ఎక్కువ టారిఫ్​ను ఎదుర్కొంటున్నందున మన సరఫరాదారులకు కొత్త అవకాశాలు వస్తాయని పేర్కొంది.  భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూకే తదితర దేశాలపై యూఎస్ 10 శాతం టారిఫ్ విధించింది. చైనా, వియత్నాం, థాయ్​లాండ్​, తుర్కియే, యూఏఈ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి పలు పోటీ దేశాలపై 12.5 శాతం టారిఫ్ ఉంటుంది.

  యూఎస్ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు పెరిగినప్పటికీ, వస్త్రాలు, దుస్తులు, లెదర్, ఫుట్‌వేర్  ఎగుమతిదారులు ఎప్పట్లాగే ప్రత్యర్థులతో పోటీపడవచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్, కంబోడియా, పాకిస్తాన్, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా వంటి ప్రత్యర్థి సరఫరాదారులు కూడా 10 శాతం టారిఫ్ పరిధిలోనే ఉన్నారు. 

పోటీ దేశాలు 12.5 శాతం టారిఫ్ ఎదుర్కొంటున్న కొన్ని ఉత్పత్తి విభాగాలలో భారతీయ కంపెనీలు ప్రయోజనాలను పొందవచ్చు. అత్యంత పోటీ మార్కెట్లలో కొనుగోలు నిర్ణయాలను 2.5 శాతం తేడా కూడా ప్రభావితం చేయగలదు.  అయితే, సెక్షన్ 232 ప్రకారం ఉక్కు, అల్యూమినియం, ఆటో భాగాలు, ఫార్మాస్యూటికల్స్, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మినహాయింపులు ఉంటాయి. 

సెక్షన్ 301 టారిఫ్ ఎందుకు విధిస్తారంటే..

అమెరికా వాణిజ్య చట్టం 1974 లోని సెక్షన్ 301 ప్రకారం విదేశీ దేశాల అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అరికట్టడానికి యూఎస్ ఈ టారిఫ్ విధిస్తుంది. ఇతర దేశాల చట్టవిరుద్ధ విధానాలు, బలవంతపు కార్మిక వ్యవస్థలు, ట్రేడ్ ఒప్పందాల ఉల్లంఘనలు అమెరికా వాణిజ్యానికి నష్టం కలిగిస్తున్నప్పుడు ఈ చర్య తీసుకుంటుంది. అక్కడి ఎగుమతిదారులకు రక్షణ కల్పించడానికి, సరసమైన వాణిజ్య వాతావరణాన్ని ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది. దేశీయ పరిశ్రమలను కాపాడటానికి ఈ సెక్షన్​ద్వారా టారిఫ్​ విధిస్తుంది.