ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి మనం రకరకాల డైట్లు, వర్కౌట్లు చేస్తుంటాం. కానీ, మన ఇంట్లో దొరికే కొన్ని రకాల డ్రై సీడ్స్, ఫ్రూట్స్ ప్రతిరోజూ నానబెట్టి తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు ! రోజు తినే ఆహారంలో చిన్న మార్పులు చేస్తూ మన శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచే ఆ 4 సూపర్‌ఫుడ్స్ ఏంటో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం...
అవిసె గింజలు: వీటిలో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ -బి, ఇనుము, మాంసకృత్తులు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ చెంచా నానబెట్టిన గింజలను తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.
అంజీరా: ఇది పోషకాల గని. దీంట్లో ఎ, బి విటమిన్లు, క్యాల్షి యం, ఇనుము, మాంగనీస్, సోడియం, పొటాషియం, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి అనారోగ్యాలు దరిచేరకుండా చేస్తాయి. మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి.
బాదం : రోజూ నానబెట్టిన అయిదారు బాదంపప్పులు తింటే మెదడు చురుకుగా ఉంటుంది. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గడంతోపాటు బరువూ నియంత్రణలో ఉంటుంది.
ఎండుద్రాక్ష: వీటిలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కిస్మిస్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా మారడంతోపాటు కాంతివంతంగా మెరుస్తుంది. రోజూ రాత్రిపూట పది, పన్నెండు ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
