పద్మారావునగర్, వెలుగు: పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనకు బీఆర్ఎస్ను వీడే ఆలోచన ఏమాత్రం లేదని, చివరి వరకు బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
కేటీఆర్ బర్త్డే సందర్భంగా బోయిన్‌పల్లిలోని తన నివాసంలో మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ 125 ఏళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని, కాంగ్రెస్ ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడుతున్న ఆయనే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నియోజకవర్గం నుంచి ఒక కార్యకర్త తన రక్తంతో రాసిన లేఖ విషయాన్ని ప్రస్తావించిన మల్లారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తాను పార్టీ మారుతున్నాననే వార్తలతో మనస్తాపానికి గురై ఆ కార్యకర్త రక్తంతో లేఖ రాయడం తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు.
లేఖపై చిరునామా లేనప్పటికీ, వివరాలు తెలుసుకొని స్వయంగా అతడిని కలుస్తానని తెలిపారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టేలా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోనని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే క్యాంప్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ బ్యానర్లు, పోస్టర్లు తొలగించడం కనిపించింది. పెద్ద ఫ్లెక్సీ బోర్డును వెనక్కి తిప్పి ఉంచడం చర్చనీయాంశంగా మారింది.
