- గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కమిషనర్లుగా ఆర్వీ కర్ణన్, జి. సృజన, వినయ్ కృష్ణారెడ్డి
- ఐఏఎస్‌ల బదిలీ.. పలువురికి కీలక బాధ్యతలు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
- ఎస్సీ అభివృద్ధి శాఖ బాధ్యతలు సవ్యసాచి ఘోష్‌కు
- పంచాయతీరాజ్ కమిషనర్‌గా డి. దివ్య
- ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా కాత్యాయనీదేవి
- సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పరిపాలనాపరంగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి కీలకమైన అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పునర్విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కలిపి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్‌ను నియమించింది. ఈ 3 కార్పొరేషన్లకు ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించింది.
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్‌ను సింగరేణి సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా నియమించింది. ఇప్పటిదాకా ఆ పోస్టులో అదనపు బాధ్యతలతో కొనసాగుతున్న కృష్ణభాస్కర్‌ను తప్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన పథకాల అమలు విభాగానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సవ్యసాచి ఘోష్ కు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఆ శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌కుమార్
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియాకు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవోగా ఉన్న డి. దివ్య కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సెర్ప్ అదనపు సీఈవోగా ఉన్న పి. కాత్యాయనీదేవిని బదిలీ చేసి..‘ప్రజావాణి’ రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా నియమించారు.
రాష్ట్ర ఆర్థిక సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఈమె అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు. జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న మయాంక్ మిట్టల్ ను .. అదే శాఖకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఐటీ శాఖ మంత్రి వద్ద ప్రత్యేక అధికారి (ఓఎస్డీ)గా ఉన్న యు. రఘురామ్‌శర్మను.. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. మంత్రి వద్ద ప్రత్యేక అధికారిగా కూడా ఆయనే కొనసాగుతారు.
మూడు కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లు వీరే..
కార్పొరేషన్ల విభజనతో పాటు కమిషనర్లను కూడా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆర్వీ కర్ణన్.. పునర్వ్యవస్థీకరించిన ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’కు కమిషనర్‌గా కొనసాగుతారు. కొత్తగా ఏర్పడిన ‘సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’కు కమిషనర్‌గా.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న జి.సృజనను బదిలీ చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు.
