అయోధ్య రామాలయంలో రూ.5 కోట్ల రామచరితమానస్ బంగారు పుస్తకం మాయం..?

అయోధ్య రామాలయంలో  రూ.5 కోట్ల రామచరితమానస్ బంగారు పుస్తకం మాయం..?

తీగ లాగితే డొంకంతా కదిలింది.. అనే సామెత అయోధ్య రామాలయంలో చోరీ కేసుకు కరెక్టుగా సరిపోతుంది. ఆయలంలో విరాళాల చోరీ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం బయటపడుతూ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుడిలో 5 కోట్ల రూపాయల విలువైన రామచరిత మానస్ బంగారు పత్రం మాయమైనట్లు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్.లక్ష్మీనారాయణన్ ఆరోపించడం సంచలనంగా మారింది. 

లక్ష్మీనారాయణన్ చెప్పిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 2024లో బంగారు పూత పూసిన రామచరితమానస్‌ను శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత  ఆ పత్రం లేదా పుస్తకం ఆలయ ప్రాంగణం నుంచి మాయం చేశారని ఆయన చేశారు. దీనిపై ప్రశ్నించినప్పుడు ఆలయానికి సమర్పించిన ప్రతి కానుకను మందిరంలో ప్రదర్శించలేమని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తనకు చెప్పినట్లు లక్ష్మీనారాయణన్ తెలిపారు.

వెండి విరాళాలు ఏమయ్యాయి..?

రామ మందిరానికి  విరాళంగా వచ్చిన వెండికడ్డీలు, ఇటుకలు అదృశ్యమయ్యాయని  ప్రతిపక్షాలు ఆరోపించాయి.  ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రశ్నలు లేవనెత్తాయి. వాటిలో ఆలయ నిర్మాణ ప్రక్రియ సమయంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే విరాళంగా ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక కూడా ఉంది. అయితే, ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక సిట్, సుమారు 200 కిలోల బరువున్న వెండి కడ్డీలు దొంగిలించారనే వార్తలను తోసిపుచ్చింది. 

ఆలయం నుంచి ఎత్తుకెళ్లిన బంగారు ఆభరణాలను, వాటిని మళ్లీ గుర్తుపట్టకుండా చెరిపివేసి.. బిస్కెట్లుగా మార్చారా అనే కోణంలో దర్యప్తు చేస్తున్నారు


లెక్కింపు ప్రక్రియలో నా పాత్ర లేదు: ఆలయ కోశాధికారి 

అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల దొంగతనం కేసులో నెలకొన్న వివాదంలో, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి ఈ విషయంపై మౌనాన్ని వీడారు. దీనిపై  రెండు పేజీల ప్రకటనను విడుదల చేశారు. కానుకల లెక్కింపులో తనకు ఎలాంటి పాత్ర లేదని , ఈ విషయంపై నిష్పక్షపాతమైన విచారణ జరపాలని పిలుపునిచ్చారు.

►ALSO READ | అయోధ్య రామాలయం నిధులు కేసు.. ప్రియాంకాగాంధీ, కేజ్రీవాల్ ను ప్రశ్నించాలి : వీహెచ్ పీ 

ఇది బీజేపీ–ఆరెస్సెస్ కలిసి చేసిన కుంభకోణం: కాంగ్రెస్

అయోధ్యలోని రామ మందిరానికి విరాళాల చోరీ అంశంపై  కాంగ్రెస్ ఆదివారం (జులై 05) బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్రంగా విరుచుకుపడింది. ఇది బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి చేసిన 'ఘోటాలా' (కుంభకోణం) అని అభివర్ణించింది . ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మౌనం వీడాలని డిమాండ్ చేసింది. 

రామ మందిర విరాళాల చోరీ జూన్ 7న వెలుగులోకి వచ్చింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.