ఈ వానాకాలం
ఏడు సన్న రకాలకే బోనస్
డీలర్లు విత్తనాలు అమ్మిన వివరాలు సైట్‌లో నమోదు చేయాలి
డీలర్ల వద్ద కొనని రైతులకు
ఏఈవోల వద్ద నమోదు చేసుకునే చాన్స్
హైదరాబాద్, వెలుగు: సన్న వడ్లకు ప్రకటించిన బోనస్ అమలులో పారదర్శకత కోసం రాష్ట ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. 2026 వానాకాలం సీజన్‌లో సాగు కోసం ఎంపిక చేసిన ఏడు సన్న వరి రకాలకే బోనస్ వర్తించనున్న నేపథ్యంలో, రైతులు, విత్తన డీలర్లు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. రైతులకు విత్తనాలు విక్రయించిన వెంటనే డీలర్లు సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే విత్తన డీలర్ల వద్ద విత్తనాలు కొనని రైతులకు ప్రత్యేకంగా వరి సన్న రకాల వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
విత్తన డీలర్ల వివరాలు నమోదు ఇలా
విత్తన డీలర్లు రైతులకు విత్తనాలు విక్రయించిన వెంటనే సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇందుకోసం https://seedsgrowerp.com/seedsales/login.php వెబ్‌సైట్‌లో లాగిన్ అయి వరి సన్న రకాల అమ్మకాల ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని వివరాలను నమోదు చేసి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. డీలర్లకు క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా సైట్‌లోకి ప్రవేశించే సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచారు.
డీలర్లు సన్న వరి రకాలు నమోదు సమయంలో రైతు పేరు, తండ్రి పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌తో పాటు కొనుగోలు చేసిన విత్తన రకం, కంపెనీ పేరు, లాట్ నంబర్, డీలర్ వివరాలు, కొనుగోలు చేసిన తేదీ, సీడ్ ప్యాకెట్ పరిమాణం తదితర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ 2026 వానాకాలం సీజన్‌లో విక్రయించిన సన్న వరి విత్తనాలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నమోదు పూర్తి చేయాలని సూచించారు.
ఏడు రకాల విత్తనాలకే బోనస్
బోనస్‌కు ఎంపిక చేసిన ఏడు సన్న వరి రకాల్లో ఆర్‌ఎన్‌ఆర్–15048, బీపీటీ–5204, కేఎన్‌ఎం–1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యుజీఎల్–44, కేఎన్‌ఎం–7715 రకాలు మాత్రమే ఉన్నాయి. ఈ సన్న రకాల సాగు వివరాలు నమోదైన రైతులకే బోనస్ వర్తించే అవకాశం ఉంది. ఇక డీలర్ల వద్ద విత్తనాలు కొనకుండా, స్వయంగా గత పంట నుంచి విత్తనాలు సిద్ధం చేసుకుని సాగు చేసే రైతులకు కూడా అవకాశం కల్పించారు.
అలాంటి రైతులు తమ గ్రామ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ని సంప్రదించి సన్న వరి సాగు వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్‌లో సన్న వరి రకాల నమోదు కోసం ప్రత్యేక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతుల సాగు వివరాలను ఏఈవోలు యాప్ ద్వారా నమోదు చేయనున్నారు.
ఆక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక ప్రక్రియ..
సన్న వడ్ల బోనస్ అమలులో ఎలాంటి అక్రమాలు, తప్పుడు నమోదులు జరగకుండా ఈ ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. విత్తనాల కొనుగోలు నుంచి సాగు వివరాల నమోదు వరకు ప్రతి దశను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా అర్హులైన రైతులకు మాత్రమే బోనస్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం.
