- 67.45 లక్షల మంది ఖాతాల్లో జమ చేసిన సర్కార్
- రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం రికార్డు
- 5 నుంచి 6 ఎకరాల వరకు అందిన పెట్టుబడి సాయం
- ఐదో విడతలో 1.69 లక్షల రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లు జమ
- అర్హులైన రైతులందరికీ ఇస్తున్నం: మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదు రోజుల వ్యవధిలోనే రూ.7,135.77 కోట్లను రాష్ట్రంలోని 67.45 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం రైతు భరోసా పథకం కింద ఐదో విడతలో ఐదు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 1.69 లక్షల మంది రైతులకు రూ.545.41 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటికే తొలి నాలుగు విడతల్లో నాలుగు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఆరు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులందరికీ ఆర్థిక సాయం అందించిందని ఆయన తెలిపారు. దీంతో రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు మొత్తం 67.45 లక్షల మంది రైతులకు అందించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పని చేస్తుందని తుమ్మల స్పష్టం చేశారు.
