రాజకీయాల్లో రోశయ్య ఆదర్శప్రాయుడు..ఆయన ప్రతి నిర్ణయంలో ప్రజాహితం ఉండేది: మంత్రి వివేక్ వెంకటస్వామి

రాజకీయాల్లో రోశయ్య ఆదర్శప్రాయుడు..ఆయన ప్రతి నిర్ణయంలో ప్రజాహితం ఉండేది: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     రవీంద్రభారతిలో రోశయ్య 93వ జయంతి వేడుకలు

రవీంద్రభారతి, వెలుగు: దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆదర్శ రాజకీయ నాయకుడని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజకీయాల్లో విలువలు, పారదర్శకతకు ఆయన ప్రతీకగా నిలిచారని, ఆయన ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్నే ప్రామాణికంగా తీసుకునేవారని కొనియాడారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రోశయ్య 93వ జయంతి వేడుకలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్​చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ వీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే వినోద్, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వైశ్య కార్పొరేషన్ చైర్‌‌‌‌ పర్సన్ కాల్వ సుజాత, ఐఏఎస్ అధికారి వాణి ప్రసాద్ తదితరులు పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్​మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష సభ్యుడిగా అసెంబ్లీలో రోశయ్య కీలక అంశాలను లేవనెత్తేవారని, బడ్జెట్ పత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేసేవారని మంత్రి తెలిపారు. 

ఆర్థిక మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లు రాష్ట్ర ప్రాధాన్యతలు, సంక్షేమం, అభివృద్ధి దిశను స్పష్టంగా ప్రతిబింబించేవని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ రెండు ప్రాంతాలకు న్యాయం జరిగేలా ఆలోచించాలని రోశయ్య సూచించారని గుర్తుచేశారు. ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పటికీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ జైపూర్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం ఆయన విశాల దృక్పథానికి నిదర్శనమన్నారు. రాత్రివేళల్లో కూడా సచివాలయంలో ఉండి ఫైళ్లను పరిశీలించి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలనే తీసుకునేవారని చెప్పారు. తన తండ్రి దివంగత నాయకుడు వెంకటస్వామితో రోశయ్యకు ఉన్న స్నేహం ఎంతో ఆత్మీయమైందని, హోదాలకు అతీతంగా వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగించారని మంత్రి పేర్కొన్నారు. 

రోశయ్యకు ఏకలవ్య శిష్యుడిని:  మంత్రి పొన్నం

విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజుల నుంచే రోశయ్య నాయకత్వాన్ని ఏకలవ్య శిష్యుడిలా అనుసరించానని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పెంపొందించుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ రోశయ్య జీవితం ఒక తెరిచిన పుస్తకమని, ఆయన ఆర్థిక తత్వాన్ని నేటి రాజకీయాలు, పాలనలో అన్వయించుకుంటే సమర్థమైన వ్యవస్థను నిర్మించవచ్చని పేర్కొన్నారు.  పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా, ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్ గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రోశయ్య కుటుంబ సభ్యులు ఆయన గౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ ఘనంగా సన్మానించారు.