దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు ప్రభుత్వం కృషి : మంత్రి పొన్నం

దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు ప్రభుత్వం కృషి : మంత్రి పొన్నం
  • సమసమాజ నిర్మాణమే ఆయనకిచ్చే నిజమైన నివాళి: మంత్రి పొన్నం 

హైదరాబాద్, వెలుగు: మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్టుగా పొన్నం హాజరయ్యారు. దొడ్డి కొమురయ్య ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య ఆశయాలు, సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం వంటి విలువలను కాపాడటం మన అందరి బాధ్యత అన్నారు. ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతు సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మహనీయుల ఆశయాలను భావితరాలకు చేరవేయడం, సమసమాజ నిర్మాణానికి కృషి చేయడం ఎంతో అవసరమన్నారు. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం అందించే ఆస్తి విద్య మాత్రమే

గతంలో భూములు, ఆర్థిక నిల్వలు ముఖ్యం కాగా.. ప్రస్తుతం ప్రభుత్వం అందించే ఆస్తి విద్య మాత్రమేనని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఇటీవల చేపట్టిన కుల గణన సర్వేలో ఏ కుటుంబాలైతే ఉన్నత చదువులు చదివాయో, ఆ కుటుంబాలే ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. జీవితంలో చదువు ఎంతో ముఖ్యమైందని, విద్యావంతులైనప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతామని పిలుపునిచ్చారు. అనంతరం దొడ్డి కొమురయ్య అన్న కుమారుడు దొడ్డి బిక్షపతి వైద్య చికిత్సల కోసం కురుమ సంఘం ట్రస్టు తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయం చెక్కును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, గొర్రెల అభివృద్ధి  కార్పొరేషన్ చైర్మన్ సరిత తిరుపతయ్య  తదితరులు పాల్గొన్నారు.