పదేండ్లలో నీళ్లు.. నిధులు, ఉద్యోగాలు ఇయ్యలే.. పాపాల భైరవుడు మళ్లీ రావాల్నా: సీఎం రేవంత్

పదేండ్లలో నీళ్లు.. నిధులు, ఉద్యోగాలు ఇయ్యలే.. పాపాల భైరవుడు మళ్లీ రావాల్నా: సీఎం రేవంత్
  • వాళ్లు లక్ష కోట్ల ఆస్తులు కూడబెట్టుకొని రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిన్రు
  • ఇప్పుడు సంపాదన, దోపిడీ ఆగిపోవడంతో అల్లుడు, కొడుకు గద్దల్లా తిరుగుతున్నరు
  • అసెంబ్లీకి రాడు.. ప్రజా సమస్యలు ప్రస్తావించడు.. అధికారం ఇస్తే దోచుకోవడానికి వస్తడట
  • వాళ్లకు అధికారం కలే..ఆ పశుపతి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో కుంగి కృశించాల్సిందే 
  • పేదల కోసం పనిచేసే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలి 
  • దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం చారిత్రక అవసరం
  • ఇందుకు తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని పిలుపు
  • మిడ్జిల్ ‘కృతజ్ఞత సభ’లో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రసంగం

మహబూబ్​నగర్, వెలుగు: పదేండ్లు తెలంగాణను దోచుకున్న పాపాల భైరవుడు (కేసీఆర్‌‌‌‌‌‌‌‌) మళ్లీ ఎందుకు  అధికారంలోకి రావాలో చెప్పాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన్ను నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే  లక్ష కోట్ల అక్రమాస్తులను సంపాదించుకొని.. రాష్ట్రాన్ని మాత్రం 8.21 లక్షల కోట్ల అప్పుల కుప్పలా మార్చారని ఫైర్​ అయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ పోరాటం జరిగిందని, కానీ పదేండ్లు ఇవేవీ నెరవేరలేదని తెలిపారు.  

తన 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్‌‌‌‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘కృతజ్ఞత సభ’లో  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాట్లాడారు. తాము మళ్లీ అధికారంలోకి రావాలని.. పాపాల భైరవుడికి పగ్గాలు అప్పగించాలని కేటీఆర్​, హరీశ్‌‌‌‌రావు​ గల్లీ, గల్లీ, ఊరూరు తిరుగుతున్నారని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘రావాలి.. రావాలి అంటే ఎవరయ్యా రావాలంటే ఫామ్‌‌‌‌హౌస్​లో బందీ అయిన పాపాల భైరవుడు కేసీఆర్​ బయటకు రావాలని అర్థం. 

ఉద్యమంలో ఆయన చెప్పిన అప్పులను, తప్పులను, అబద్ధాలను తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు నమ్మారు. తెలంగాణ వచ్చాక పదేండ్లు అధికారం ఇచ్చారు. పదేండ్లలో రాష్ట్రంలో ఆయన చేసింది.. ఇసుక దోపిడీకి అడ్డుపడిన నేరేళ్ల దళితులపైకి లారీలు ఎక్కించి తొక్కించడం..  పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మం జిల్లాలో రైతులను జైళ్లలో పెట్టించడం.. పరీక్ష పేపర్లను పల్లీ బఠానీల్లాగా అమ్మడమే.. నిధులు, నీళ్లు,  నియామకాల మాట ఎత్తలే.. అల్లడిని, కొడుకును మంత్రులుగా చేసిండు.

 ఆయన బిడ్డ కల్వకుంట్ల కవితను ఎంపీగా చేసిండు. మళ్లీ ఓడితే ఎమ్మెల్సీని చేసిండు. సడ్డకుడి కొడుకును రాజ్యసభ సభ్యుడిని చేసిండు. వినోద్​, దయాకర్‌‌‌‌‌‌‌‌రావు.. ఇలా కావాల్సిన వాళ్లకు పదవులు ఇచ్చిండు. వీళ్లు ఓడిపోతే వాళ్ల ప్రభుత్వంలో సలహారుదాలుగా చేసిండు. ఆ పాపాల భైరవుడు ఒకాయనకు చూపించుకోవడానికి టీవీ ఇచ్చిండు. రాసుకోవడానికి పేపరు ఇచ్చిండు. అబద్ధాలు చెప్పడానికి, వినడానికి భజనపరులను ఇచ్చిండు’’ అని పేర్కొన్నారు. 

‘‘పదవులు, సంపాదన, దోపిడీ పోయేసరికి  మళ్లీ అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్నరు. అధికారం కావాలని గుండెలు బాదుకుంటున్నరు. అందుకే రావాలి రావాలి.. మా పాపాల భైరవుడు రావాలి అంటున్నరు.  ప్రజపాలన పోవాలంటూ మాట్లాడుతున్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​మళ్లీ అధికారంలోకి వస్తే ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లలో అమ్మిన గంజాయి, డ్రగ్స్‌‌‌‌ను రైతు బజార్లలో  పెట్టి విక్రయిస్తారు. యువత ఈ విషయంపై ఆలోచించాలె. పాపాల భైరవుడు మళ్లీ వస్తే ఏం జరుగుతుందో పెండ్లిల్లు, దావత్‌‌‌‌లు, రచ్చబండల దగ్గర చర్చ పెట్టాలె’’ అని సీఎం రేవంత్​ సూచించారు.  

వందల కోట్ల ఆస్తులు, బెంజ్​కార్లు ఎట్లా వచ్చినయ్..?

పదేండ్లలోనే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికి వందల కోట్ల ఆస్తులు.. బెంజ్‌‌‌‌ కార్లు ఎట్లా వచ్చాయని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ప్రశ్నించారు. ‘‘అధికారంలోకి వస్తే ఏం చేస్తరు మీరు? ఏం చేయడానికి మీరు మళ్లీ రావాలి? ఏం అన్యాయం చేశామని ప్రజా ప్రభుత్వం పోవాలి? ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ఇది. ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది. మీ అక్రమ సంపాదన ఆగిపోయింది కాబట్టే అధికారంలోకి రావాలి రావాలి అనుకుంటున్నారు. దోపిడీ, దొంగతనాలు ఆగిపోయాయి. మీతోపాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఏసీబీ ఆఫీసర్లు పట్టుకుంటున్నరు. 

ఒక్కొక్కరి వద్ద వంద కోట్లు,  200 కోట్లు, 300 కోట్ల అక్రమ సంపాదన బయట పడుతోంది. వీళ్లకు ఈ సొమ్ము ఎక్కడిది? ప్రజల నుంచి దోచుకున్నదే  కదా? కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు గజ్వేల్‌‌‌‌లో, ఎర్రవెల్లిలో వెయ్యి ఎకరాల ఫామ్‌‌‌‌హౌస్​ ఎక్కడి నుంచి వచ్చింది? మీ తాత ముత్తాతలు ఇచ్చిందా? నాలుగు కోట్ల ప్రజలను దోచుకున్నదే కదా? నీ కొడుకు కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు జన్వాడలో వంద ఎకరాల ఫామ్‌‌‌‌హౌస్​ ఎక్కడి నుంచి వచ్చింది? నీ అల్లుడు హరీశ్‌‌‌‌రావుకు మొయినాబాద్‌‌‌‌లో 50 ఎకరాల ఫామ్‌‌‌‌హౌస్​ ఎట్లా వచ్చింది? కల్వకుంట్ల కవితకు శంకర్‌‌‌‌‌‌‌‌పల్లిలో పాతిక ఎకరాల ఫామ్‌‌‌‌హౌస్​ ఎక్కడి నుంచి వచ్చింది? నీ సడ్డకుడి కొడుకు సంతోష్‌‌‌‌ రావు ఆస్తుల లెక్కలు చెప్పనీకే లేదు. 

ఇంత సంపాదన ఈ పదేండ్లలో ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడివి ఈ ఆస్తులు? ఏడ సంపాదించిన్రు? ఏం వ్యాపారం చేసిన్రు? వజ్ర, వైఢూర్యాలు ఎక్కడికి నుంచి వచ్చినయ్​? ఎందుకు తెలంగాణ అప్పుల పాలైంది? ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు? నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. పదేండ్లలో రాష్ట్రాన్ని 8.21 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన్రు. మీరు లక్ష కోట్ల అధిపతులు ఎట్లైనరో సమాధానం చెప్పండి” అని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబాన్ని నిలదీశారు. 

మళ్లీ వస్తే భార్యాభర్తల మాటలు వింటరు

అప్పులు, తప్పులు చేసిన వారు మళ్లీ అధికారంలోకి వస్తే భార్యా భర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా వింటారని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి విమర్శించారు. రాజకీయ లీడర్లు మాటలు వింటే ఓ అర్థం ఉంటుందని, అధికారుల మాటలు వింటే అక్కరకు వచ్చిందేమో అనుకోవచ్చని, కానీ ఆడబిడ్డల మాటలు వినేటోళ్లు అసలు మనుషులేనా? అని మండిపడ్డారు. ‘‘ఇంటాయనతో  ఫోన్‌‌‌‌లో మాట్లాడుతుంటే ఎవరైనా ఫోన్​ వింటే ఎంత బాధైతది, ఇయాళ మన ఫోన్‌‌‌‌లు వినడానికి వీళ్లు అధికారంలోకి రావాల్నా? ప్రజలు ఆయనకు ఎమ్మెల్యే ఉద్యోగం ఇచ్చారు. కానీ అసెంబ్లీకి రాడు. ప్రజా సమస్యల గురించి మాట్లాడడు. ప్రజా సమస్యలను ప్రస్తావించడు. 

దోచుకోవడానికి, దోపిడీ చేయడానికి మాత్రం అధికారంలోకి వస్తాం అంటున్నారు’’ అని అన్నారు. ‘‘ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ లీడర్లకు అహంకారం, అహంభావం పెరిగిపోయాయి. గద్దర్​ అన్నను గడీల ముందు 4 గంటలు ఎర్రటి ఎండలో కూర్చోబెట్టిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను మనం క్షమించాలా?   తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదలా పనిచేసిన గద్దర్​   కలవడానికి వస్తే,  గడీ ముందు ఎండల నిలబెట్టినవ్‌‌‌‌..  నీకు ఉరి శిక్ష వేసినా తక్కువే’’ అని కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై మండిపడ్డారు. 

అరుంధతి సిమిమాలో పశుపతిని బూత్‌‌‌‌ బంగ్లాలో గొలుసులు కట్టి ఎలా బంధించారో.. ఈ పాపాల భైరవుడిని కూడా తెలంగాణ ప్రజలు ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో గొలుసులు కట్టి బంధించారని కేసీఆర్‌‌‌‌‌‌‌‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఆయన అక్కడే కుంగి కృషించిపోవాలి. అంతే తప్ప అధికారం అనేది ఇక కలలో మాట. రాసి పెట్టుకోండి. ఏదైనా ఉందంటే అది మీకు గతమే. మీకు భవిష్యత్తు లేదు. మీ భవిష్యత్తు తెలంగాణ ప్రజలు ముగింపు పలికారు” అని పేర్కొన్నారు.  

పాలమూరు బిడ్డ పరిపాలనకు పనికిరాడా..?

అచ్చంపేట అడవుల నుంచి వచ్చిన వ్యక్తి ఏం చేస్తడని అందరూ ప్రశ్నిస్తున్నారని సీఎం రేవంత్‌‌‌‌ అన్నారు. ‘‘ఆయనకు అనుభవం లేదు, ప్రభుత్వాన్ని నడపలేడు, వాళ్ల, తాత ముత్తాలు దొరలు కాదు. గడీలు లేవు, ప్రజల పమీద పెత్తనం చెలాయించడం రాదు’ అని  తనను అవహేళన చేస్తున్నారని చెప్పారు. ‘‘నేను పుట్టింది గ్రామం. గ్రామంలో అన్ని మతాలు, కులాలు, అన్ని సమస్యలు, పేదల కష్టాలు నాకు తెలుసు. వ్యవసాయం తెలుసు. దుక్కి దున్నడం, విత్తనం నాటడం, భూమికి, విత్తనానికి ఉన్న బంధం కూడా తెలుసు.  పేదలకు, పరిపాలన చేసే వారికి ఎలాంటి అవగాహన ఉండాలో ఆ అవగాహన నాకు ఉంది. గ్రామాల సమూహమే తెలంగాణ. 

సమస్యలు ఎక్కడుంటై? ఎక్కడ పరిష్కరించాలే? అనే విషయాలను గడీలలో ఉండే దొరలకు తెలియకపోవచ్చు. కానీ గ్రామంలో సమస్యలు పరిష్కారమైతే మండలాల్లో పరిష్కారమైనట్లే. రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారమైతే దేశం అభివృద్ధి చెందినట్లే. కొండారెడ్డిపల్లిలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, పేదల మధ్య పుట్టి పెరిగిన నేను.. పేదల సమస్యలకు పరిష్కారం కనిపెట్టలేనా? పరిపాలన అందించలేనా? పాలమూరు బిడ్డలు పరిపాలనకు పనికిరారా? తట్ట పని, పారా పని, పలుగు పని  చేసే మనకు.. పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురహంకారాన్ని బొంద పెట్టాల్సిన బాధ్యత ఉన్నది’’ అని అన్నారు. 

రాహుల్‌‌‌‌ను ప్రధానిని చేయాలి

రాహుల్‌‌‌‌ గాంధీని ప్రధానిని చేయాలని, ఇందుకు తెలంగాణ ప్రజలకు తనకు సహకరించాలని సీఎం రేవంత్‌‌‌‌ విజ్ఞప్తి చేశారు. ‘‘ కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావాలి, రాహుల్​ గాంధీ ప్రధాని కావాలి. ఇది చారిత్రక అవసరం.  రాహుల్‌‌‌‌ను ప్రధానిని చేసేందుకు నాకు తెలంగాణ ప్రజలు అండగా ఉండాలి. అందుకే 2029 ఎన్నికల్లో నాతో నడవండి. మనందరం కలిసి నడుద్దాం. దేశానికి రాహుల్‌‌‌‌ను ప్రధానిని చేద్దాం. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు మధుసూదన్‌‌‌‌రెడ్డి, మేఘారెడ్డి, వంశీకృష్ణ , నారాయణరెడ్డి, శంకర్, రాజేశ్‌‌‌‌రెడ్డి, రాంమోహన్​రెడ్డి, జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే నవీన్‌‌‌‌రెడ్డి, కార్పొరేషన్​ చైర్మన్లు ఒబేదుల్లా కొత్వాల్‌‌‌‌, సరిత, మహబూబ్‌‌‌‌నగర్​ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్​ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్​ పదేండ్ల లెక్క తేల్చాలి

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో రైతు భరోసా కోసం రూ. 1.76 లక్షల కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి గుర్తు చేశారు. సరాసరి ప్రతి నెలా 5,600 కోట్లు  ఖర్చు చేస్తున్నామన్నారు. పదేండ్లలో కేసీఆర్​ ప్రభుత్వం  చేసిందేందో  తేల్చాలని అడిగారు.‘‘ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌‌‌‌తో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్‌‌‌‌కు అప్పగిస్తే  పదేండ్లలో రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేశారు. 

మధ్యలో 20 లక్షల కోట్ల బడ్జెట్ ​మీ చేతికి వచ్చింది. కేసీఆర్ ఏడాదికి రెండు లక్షల డబుల్​ ఇండ్లు కట్టినా, పదేండ్లలో 20 లక్షల మంది పేదలకు ఇండ్లు దక్కేవి. కానీ  ఒక్క ఊరిలో కూడా డబుల్​ బెడ్​ రూమ్ ​ఇండ్లు ఇవ్వలేదు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కోటి ఎకరాలకు నీరు పారిస్తానని కోట్లు సంపాదించుకున్నారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేండ్లలో కూలేశ్వరం అయింది. లక్ష కోట్లు గోదావరి పాలైంది” అని పేర్కొన్నారు.  

మిడ్జిల్‌‌‌‌ నేతలతో ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌లో బయలుదేరాల్సిన సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి.. వాతావరణం అనుకూలించక రోడ్డు మార్గాన  ముందుగా నాగర్​కర్నూల్​ జిల్లా ఊర్కొండ మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఊర్కొండపేట గ్రామంలోని ప్రసిద్ధ పబ్బతి ఆంజనేస్వామి దేవాలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌‌‌కు అర్చకులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. 

అనంతరం గ్రామంలో ఊర్కొండ, మిడ్జిల్​ మండలాల నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారితో ఫొటోలు దిగారు. అక్కడి నుంచి సాయంత్రం మిడ్జిల్​ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఉమ్మడి మిడ్జిల్​ మండంలోని అన్ని గ్రామాలకు స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్​ కింద చెక్​ డ్యాములు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అభివృద్ధి పనులకు ప్రతి పంచాయతీకి రూ.50 లక్షల చొప్పున నిధులు కేటాయించి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

సీఎం రేవంత్‌‌ రెడ్డిది నిజమైన ప్రజాపాలన: డిప్యూటీ సీఎం భట్టి

సీఎం రేవంత్‌‌ రెడ్డిది నిజమైన ప్రజాపాలన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అధికారులు రాసిచ్చిన నివేదికలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూసి, వాటిని పరిష్కరించే నాయకుడిగా సీఎం రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో నడిపిస్తున్నారన్నారు. సాధారణంగా సీఎం పర్యటనలంటే భద్రతా వలయాలు, అధికారుల హడావుడి కనిపిస్తుందని.. కానీ, రేవంత్‌‌ రెడ్డి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టారని తెలిపారు. జడ్పీటీసీగా ప్రస్థానం మొదలుపెట్టి నేడు సీఎంగా ఎదిగినా, ఆనాడు తనను దీవించిన ప్రజలను మర్చిపోకుండా తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పే రేవంత్‌‌ రెడ్డి సంస్కారమే ఆయనను గొప్ప నాయకుడిగా నిలబెడుతుందని అన్నారు.