స్టెరాయిడ్స్ విక్రయ ముఠా అరెస్ట్ ..రూ. 6.5 లక్షల విలువైన ఇంజెక్షన్లు స్వాధీనం

స్టెరాయిడ్స్ విక్రయ ముఠా అరెస్ట్ ..రూ. 6.5 లక్షల విలువైన ఇంజెక్షన్లు స్వాధీనం

పద్మారావునగర్, వెలుగు: యువతలో త్వరగా కండరాలు పెరుగుతాయనే ఆశను ఆసరాగా చేసుకుని స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ సప్లిమెంట్లు విక్రయిస్తున్న ఆరుగురిని శనివారం ముషీరాబాద్ పోలీసులు, సికింద్రాబాద్ జోన్ టాస్క్‌‌ఫోర్స్ సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.6.5 లక్షల విలువైన 440 టెర్మిన్ వయల్స్, 336 మెఫెన్‌‌టెర్మిన్ సల్ఫేట్, టెస్టోస్టెరాన్, గ్రీన్ స్పీడ్ ఇంజెక్షన్లు, అమినో యాసిడ్స్, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ముషీరాబాద్‌‌కు చెందిన ఆన్‌‌లైన్ జిమ్ ట్రైనర్ బట్టే శివ, స్క్రాప్ వ్యాపారి మహమ్మద్ ఫర్ఖానుద్దీన్ ఫైజల్  ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆన్‌‌లైన్ ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు తెప్పించి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. శివ ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ముదిద్ చౌహాన్ నుంచి సరుకు తెప్పించి మహమ్మద్ యూసుఫ్, అనస్థీషియా టెక్నీషియన్ అభిలాష్‌‌కు విక్రయించగా, ఫైజల్ పంజాబ్‌‌కు చెందిన రాజన్ ప్రీత్ సింగ్ నుంచి ఇంజెక్షన్లు తెప్పించి మహమ్మద్ సైఫ్, ఫర్జాన్ ఖాన్‌‌కు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ముదిద్ చౌహాన్, రాజన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నారని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్‌‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేర్కొన్నారు.