సింగరేణికి తాడిచర్ల బ్లాక్2, కోయగూడెం..? కేటాయించేందుకు కేంద్రం సూత్రప్రాయ నిర్ణయం

సింగరేణికి తాడిచర్ల బ్లాక్2, కోయగూడెం..? కేటాయించేందుకు కేంద్రం సూత్రప్రాయ నిర్ణయం
  • సింగరేణి ఉన్నతాధికారులతో కిషన్​రెడ్డి రివ్యూ
  • బొగ్గు వేలంలో సింగరేణి పాల్గొనాలని సూచన
  • కార్మికుల బ్లూ యూనిఫామ్‌‌‌‌లో 
  • సింగరేణి భవన్​కు వెళ్లిన కేంద్రమంత్రి

హైదరాబాద్, వెలుగు: తాడిచర్ల బ్లాక్2, కోయగూడెం బొగ్గు బ్లాక్‌‌లను సింగరేణి సంస్థకు కేటాయించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ బొగ్గు బ్లాకులు కేటాయించాలంటూ సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కోల్​బెల్ట్ ప్రాంతానికి చెందిన ఆరు జిల్లాల బీజేపీ అధ్యక్షులు శనివారం సింగరేణి భవన్‌‌కు వచ్చి కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిని కలిశారు. 

ఈ సందర్భంగా తాడిచర్ల బ్లాక్2 తో పాటు కోయగూడెం బ్లాక్​ను సింగరేణికి కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో అధికారంపై బీజేపీ హైకమాండ్ ఫోకస్​పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపుపై సూత్రప్రాయ నిర్ణయం 
తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రెడిట్ కాంగ్రెస్‌‌కు దక్కకుండా చేసేందుకే బీజేపీ జిల్లా అధ్యక్షులతో వినతిపత్రం ఇప్పించినట్లు చర్చ జరుగుతోంది. కేంద్రం ఈ రెండు గనులను కేటాయిస్తే సింగరేణికి మంచిరోజులు వచ్చినట్లేనని కార్మికులు అంటున్నారు.

రివ్యూకు కార్మిక యూనిఫామ్‌‌లో..

సింగరేణి పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై శనివారం హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్‌‌లో కిషన్ రెడ్డి సమీక్షించారు. రివ్యూకు ఆయన సింగరేణి కార్మికుడిలా నీలిరంగు యూనిఫామ్​లో  హాజరయ్యారు. సమావేశంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా,  సవాళ్లను సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి వివరించారు.  ముఖ్యంగా సింగరేణికి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ స్టేటస్ తొలగించడం వల్ల అటవీ భూసేకరణ ఇబ్బందులున్నాయన్నారు.  

ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు రవాణా సమస్యలను తొలగించేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. రివ్యూలో కేంద్ర బొగ్గుశాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ కస్సి, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రైవేట్ సెక్రటరీ పంకజ్ జైన్, బొగ్గు శాఖ సలహాదారులు వీరారెడ్డి, సింగరేణి డైరెక్టర్లు ఎల్ వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, ఎం.తిరుమలరావు పాల్గొన్నారు. 

కొత్త గనులు సాధించాలి

సింగరేణి సంస్థ భవిష్యత్‌‌లో తన సేవలను మరింత విస్తృతం చేయాలని, కొత్త గనులు సాధించి ఇంధన అవసరాలకు తోడ్పడాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. కొత్త గనులు సాధించుకునేందుకు వేలంలో పాల్గొనాలని సూచించారు. దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మరో 10 నుంచి 15 ఏండ్లకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ, పని సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు. 

దేశంలో కోల్ గ్యాసిఫికేషన్ కు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఈ ప్రాజెక్ట్ పై సింగరేణి దృష్టి సారించాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఫర్టిలైజర్స్, తదితర పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పాదనకు తగినంత బొగ్గు అందించేందుకు కోల్ ఇండియాతో పాటు సింగరేణి కూడా సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు.