పంజాగుట్ట, వెలుగు: రోస్టర్ విధానం వల్ల మాలలకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని మాల సంఘాల నేతలు ఆరోపించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా రోస్టర్ పాయింట్లను కేటాయించారన్నారు. శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మాల కోఆర్డినేషన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, ఫోరం వ్యవస్థాపకులు శకుంతల, శంకర్, మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు మందాల భాస్కర్ మాట్లాడారు.
లోపభూయిష్టంగా విడుదల చేసిన రోస్టర్ విధానంతో గత 20 నోటిఫికేషన్లలో ఒక్క మాల అభ్యర్థికి కూడా ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్లను 22 నుంచి 16కు తగ్గించాలని డిమాండ్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది ఉన్న మాలలను ఉద్దేశపూర్వకంగానే తక్కువ చేసి చూపించి, రిజర్వేషన్లు తీసివేసే కుట్ర పన్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ కు ఇందిరమ్మ కాలం నుంచి నేటి వరకు మాలలు అండగా నిలుస్తున్నారన్న విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి గుర్తించడం లేదని, మాదిగలకు వంత పాడటాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా మాలలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఫోరం నాయకులు తిరుపతయ్య, సర్వయ్య, శంకరయ్య, హైకోర్టు న్యాయవాది పద్మారావు, మంచాల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
