హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ శాఖలో దాదాపు 20 వేల ఖాళీలు ఉండగా, కేవలం 5 వేల పోస్టుల భర్తీకే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంని రుద్యోగులను మోసం చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులపై చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని విమర్శించారు. దిల్ సుఖ్ నగర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పోలీస్ ఉద్యో గార్థులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఖాళీ పోస్టుల భర్తీలో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఏళ్లుగా కోచింగ్ తీసుకుంటున్న పోలీస్ అభ్యర్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. అభ్యర్థులు కోరిన 4 మీటర్ల లాంగ్ జంప్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
