మేడ్చల్ మండలంలో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

 మేడ్చల్ మండలంలో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలంలోని సాయి శ్రీ నిలయ లేఅవుట్‌‌లో ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా శనివారం స్వాధీనం చేసుకుంది. సర్వే నంబర్లు 873, 882లో 13.31 ఎకరాల విస్తీర్ణంలో 256 ప్లాట్లతో 2000  సంవత్సరంలో సాయి శ్రీ నిలయ పేరుతో లేఅవుట్‌‌ను అభివృద్ధి చేశారు. ఇందులో ప్లాట్ నంబర్లు 111 నుంచి 116 వరకు మొత్తం 1,970 చదరపు గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు.

అందులో సుమారు 400 చదరపు గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించి, ప్లాట్లుగా విభజించి ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాకులతో ప్రహరీ నిర్మించారు. దీనిపై సాయి శ్రీ నిలయ రెసిడెన్సీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆక్రమణ జరిగినట్లు తేలడంతో శనివారం ప్రీకాస్ట్ కాంక్రీట్ ప్రహరీని అధికారులు తొలగించారు. పార్కు హద్దులను గుర్తించి, బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. ఈ పార్కు స్థలం విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రాకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.