ఎలివేటెడ్ కారిడార్ స్పీడప్..జోరందుకున్న ఫేజ్–1 ప్యారడైజ్ టు బోయిన్పల్లి పనులు

ఎలివేటెడ్ కారిడార్ స్పీడప్..జోరందుకున్న ఫేజ్–1 ప్యారడైజ్ టు బోయిన్పల్లి పనులు
  • ఇప్పటికే 18 పిల్లర్లకు ఫౌండేషన్​ పూర్తి
  • ప్రాజెక్టు వ్యయం రూ.1,487 కోట్లు
  • ఫేజ్–2 జేబీఎస్​ టు శామీర్​పేట ప్రాజెక్టుకు రూ.4,263 కోట్లు
  • పనుల తీరును వివరించేందుకు మీడియా టూర్​ నిర్వహించిన ఆఫీసర్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎలివేటెడ్​కారిడార్​రెండు దశల పనులు వేగం పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా ప్యారడైజ్​నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్​ రోడ్​వరకు 5.40 కి.మీ. పొడవున రూ.1,487 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్​కారిడార్–1 పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో రక్షణ శాఖ భూములు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి సేకరించే భూములకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో పనులు జోరుగా సాగుతున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.

పనుల తీరును వివరించేందుకు శనివారం మీడియా టూర్​నిర్వహించారు. ఎస్ఈ హుస్సేన్, ఈఈ హరికృష్ణ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ప్యారడైజ్​సమీప బాలం రాయి వద్ద ఫ్లైఓవర్ ప్రారంభమవుతుందని తెలిపారు.​ బాలం రాయి సర్కిల్​వరకు 7 పియర్స్​ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి నుంచే అండర్​ గ్రౌండ్​టన్నెల్ పనులు జరుగుతాయని, మొత్తం 600 మీటర్ల పొడవున టన్నెల్​నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఫ్లైఓవర్​ పైనుంచి వెళ్లే ప్రయాణికులు టన్నెల్ గుండా తాడ్​బండ్​సర్కిల్ ముస్లిం గ్రేవ్​యార్డు​ సమీపం వరకు ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. తిరిగి అక్కడి నుంచి ఫ్లైఓవర్​ప్రారంభమవుతుందని, బోయిన్​పల్లి సర్కిల్ వద్ద జంక్షన్​వస్తుందని, ఇక్కడ రెండు ర్యాంప్​లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి సుచిత్ర చౌరస్తా వరకు ఫ్లైఓవర్​నిర్మాణం జరుగుతోందని, ఇది డెయిరీఫామ్​రోడ్​వద్ద ముగుస్తుందని తెలిపారు.

90 శాతం భూసేకరణ పూర్తి

రెండు ఎలివేటెడ్​కారిడార్లకు సంబంధించి 90 శాతం భూసేకరణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల చిన్న చిన్న సమస్యల వల్ల భూముల బదలాయింపు జరగలేదని, ఏ సమస్యా లేని ప్రాంతాల్లో మాత్రం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు బోయిన్​పల్లి ఎలివేటెడ్​కు సంబంధించి 42.263 ఎకరాలు, శామీర్​పేటకు సంబంధించి 123.324 ఎకరాలు.. మొత్తం 165.587 ఎకరాల భూ సేకరణకు అంగీకారం కుదిరిందన్నారు.

కాగా, బోయిన్​పల్లి ప్రాజెక్టుకు 23.561 ఎకరాలు, శామీర్​పేటకు సంబంధించి 68.229 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించినట్లు పేర్కొన్నారు. మిగతాది త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రెండు ప్రాజెక్టులకు కలిపి 30 శాతం పనులకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని తెలిపారు.
 
ఎలివేటెడ్​ కారిడార్–2 ఇలా..ఎలివేటెడ్ కారిడార్–2ను ప్యారడైజ్​జంక్షన్​నుంచి శామీర్​పేట ఓఆర్ఆర్​వరకు నిర్మించనున్నారు. ప్రాజెక్టులో కొంత భాగం జేబీఎస్​ నుంచి విక్రమ్​పురి వరకు సబ్​వేగా అండర్​గ్రౌండ్​ద్వారా రహదారి నిర్మిస్తారు. తర్వాత విక్రమ్​పురి నుంచి ఎలివేటెడ్​ఫ్లైఓవర్​నిర్మిస్తారు. మొత్తం 18.14 కి.మీ. పొడువున నిర్మించే ఈ ప్రాజెక్టు వ్యయం రూ.4,263 కోట్లని అధికారులు తెలిపారు. ఇందులో ఎలివేటెడ్​పొడవు 11.150 కి.మీ. కాగా టన్నెల్​ పొడవు 0.450 కి.మీ. అని పేర్కొన్నారు.

హకీమ్​పేట ఎయిర్​ఫోర్స్​వద్ద అండర్​గ్రౌండ్​టన్నెల్​ నిర్మించనున్నామని చెప్పారు.ఈ ప్రాజెక్టులో మొత్తం డిఫెన్స్​ల్యాండ్​ 8.327 కి.మీ., ప్రైవేట్ భూములు 1.600 కి.మీ. మేర సేకరించామన్నారు. మొత్తం 19 చోట్ల జంక్షన్లు రానున్నాయని, కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్ వద్ద ర్యాంప్​లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.