హైదరాబాద్, వెలుగు: తెలంగాణను గ్లోబల్ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని ఐటీ, ఇండస్ట్రీస్శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శనివారం సెక్రటేరియెట్‌లో మంత్రి శ్రీధర్ బాబుతో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ మండలి ప్రభుత్వ విప్ లీ టార్లామిస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ – విక్టోరియా’ మధ్య వాణిజ్య, సాంకేతిక సహకారంపై చర్చించారు.
ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్టార్టప్ ఎకోసిస్టమ్, విద్య, నైపుణ్యాభివృద్ధి, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ అత్యంత అనుకూలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని లీ టార్లామిస్ పేర్కొన్నారు. ఏయే అంశాల్లో కలిసి పని చేసేందుకు అవకాశాలున్నాయో గుర్తించి.. ఆ దిశగా సమగ్ర రోడ్డు మ్యాప్‌ను సిద్ధం చేసుకుని ముందుకెళ్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎస్ సంజయ్‌జాజు పాల్గొన్నారు.
