గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌లో టాప్‌‌లో ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద

గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌లో టాప్‌‌లో ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద

జాగ్రెబ్ (క్రొయేషియా): ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఆర్‌‌. ప్రజ్ఞానంద.. గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌లో సంయుక్తంగా టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచాడు. ర్యాపిడ్‌‌లో భాగంగా శనివారం జరిగిన చివరి మూడు రౌండ్లలో విజయాలు సాధించాడు. ఇవాన్‌‌ సారిచ్‌‌ (క్రొయేషియా)త జరిగిన మ్యాచ్‌‌లో ప్రజ్ఞా కారో కాన్‌‌ డిఫెన్స్‌‌తో గెలిచాడు. డీక్‌‌ బోగ్డాన్‌‌ (రొమేనియా)తో జరిగిన గేమ్‌‌లో కేవలం 15 ఎత్తుల్లోనే ఆధిపత్యం సాధించాడు. ఈ క్రమంలో బోగ్డాన్‌‌ కీలకమైన పావును కోల్పోవడంతో ఇండియన్‌‌ ప్లేయర్‌‌కు విజయం లభించింది.

అనీష్‌‌ గిరి (నెదర్లాండ్స్‌‌)తో జరిగిన గేమ్‌‌లో కేటలాన్‌‌ ఓపెనింగ్‌‌తో ఆడిన ప్రజ్ఞానంద.. 34 ఎత్తుల్లోనే నెగ్గాడు. దాంతో 9 రౌండ్లు ముగిసేసరికి12 పాయింట్లతో ఫిరౌజా అలీరెజాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. వరల్డ్‌‌ చాంపియన్‌‌ డి. గుకేశ్‌‌.. నొడిర్బెక్‌‌ అబ్దుసత్తారోవ్‌‌, విన్సెంట్‌‌ కీమర్‌‌, ఫిరౌజా అలీరెజాలతో జరిగిన గేమ్‌‌లను డ్రా చేసుకున్నాడు. ఫలితంగా 10 పాయింట్లతో ఐదో ప్లేస్‌‌కు పడిపోయాడు.