ఫతేనగర్–బాలానగర్‌ కాలువ పూడిక తీస్తుంటే.. లారీల కొద్దీ వేస్టేజ్ బయట పడుతుందిగా..!

ఫతేనగర్–బాలానగర్‌ కాలువ పూడిక తీస్తుంటే.. లారీల కొద్దీ వేస్టేజ్ బయట పడుతుందిగా..!

హైదరాబాద్: ఫతేనగర్‌లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించే పనులకు హైడ్రా శ్రీకారం చుట్టింది. దీన్‌దయాల్‌నగర్ నుంచి 3 కిలోమీటర్ల మేర పూడికతీత పనులు మొదలయ్యాయి. నాలాలో ఆరేడు అడుగుల మేర పూడిక పేరుకుపోయింది. లారీల కొద్దీ పూడిక బయట పడుతుండటంతో సిబ్బంది విస్తుపోయారు. కల్వర్టుల దగ్గర పూడికతీతతో సరిపోదని, నాలా పొడవునా పూడిక తొలగింపునకు హైడ్రా చర్యలు తీసుకుంది.

ఫతేనగర్–బాలానగర్‌లో వరద కాలువకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవడమే ఇందుకు కారణం. 25 మీటర్ల నుంచి 40 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా కుంచించుకుపోయింది. నాలా ఆక్రమణలను గుర్తించి తొలగించాలని సిబ్బందిని హైడ్రా ఆదేశించింది. 

పారిశ్రామిక యూనిట్లతో సమావేశానికి హైడ్రా నిర్ణయించింది. పూడిక, ఆక్రమణలతో 4–5 సెం.మీ వర్షానికే ముంపు ముప్పు ఉందని గతానుభవాలను హైడ్రా గుర్తుచేసింది. వరద కాలువలో పారిశ్రామిక వ్యర్థ జలాలతో కాలుష్యం పెరిగిపోవడంతో.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లారు. పూడికతీత పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆక్రమణల తొలగింపునకు సహకరిస్తామని పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావడం గమనార్హం.