లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేవర్ టౌన్‌లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పేరును నరేంద్ర మోడీ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చింది. ప్రజా ప్రతినిధిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ గౌరవార్ధవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. శుక్రవారం (అక్టోబర్ 9) సీఎం యోగి అధ్యక్షతన యూపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో నోయిడా ఎయిర్ పోర్టు పేరును మోడీ ఎయిర్ పోర్టుగా మార్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కాగా, నోయిడా విమానాశ్రయ మొదటి దశను 2026, మార్చిలో ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ 25 ఏళ్ల ప్రజా సేవకు గౌరవార్ధవంగా నోయిడా ఎయిర్ పోర్టు పేరును నరేంద్ర మోడీ విమానాశ్రయంగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ప్రజా ప్రతినిధి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నాన్నారు.
ALSO READ: జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
ఆయన దేశాన్ని ముందుండి నడిపిస్తూ ప్రజాదరణ పొందిన ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్నారని కొనియాడారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి సంకల్పం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సమర్థవంతమైన సమన్వయంతో యూపీ అపూర్వమైన ప్రగతి పథంలో దూసుకుపోతోందని తెలిపారు. యూపీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నందుకు ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గం ప్రధాని మోడీకి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని అన్నారు.
