బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు విడుదలై ఏళ్లు గడిచినా.. వాటి క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదు. అలాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం 'అదుర్స్' ఒకటి. ఇందులో చారీ, భట్టు చేసిన హంగామాను టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మార్క్ కామెడీ టైమింగ్, బ్రహ్మానందం అద్భుత నటనతో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక ఆల్ టైమ్ క్లాసిక్ కల్ట్ కామెడీగా నిలిచింది. అయితే, ఇప్పుడు ఆ మ్యాజిక్ మళ్లీ రిపీట్ కాబోతోందా? అంటే అవును అనే సంకేతాలే ఇస్తున్నారు ప్రముఖ రచయిత కోన వెంకట్.
హైదరాబాద్‌లో జరిగిన ' కామ్రేడ్ కళ్యాణ్' ఈవెంట్‌లో 'అదుర్స్' సీక్వెల్ పై కోన వెంకట్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మొన్ననే తారక్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ వారంలోనే ఆయన్ని నేరుగా కలవబోతున్నాను. ఆ మీటింగ్‌లో ప్రధానంగా 'అదుర్స్ 2' గురించే చర్చించబోతున్నాను అని చెప్పారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఒక కొత్త వైబ్ మొదలైంది.
నిజానికి 'అదుర్స్ 2' అనగానే కోన వెంకట్ ఎప్పుడూ కాస్త ఎమోషనల్ అండ్ ఎగ్జైటెడ్‌గానే ఉంటారు. రెండేళ్ల క్రితం కూడా చారీ లాంటి క్యారెక్టర్‌ని తారక్ తప్ప ఈ భారతీయ చిత్రసీమలో మరెవ్వరూ మెప్పించలేరు అన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి ఒప్పుకోవడానికి అవసరమైతే తారక్ ఇంటి ముందు ధర్నా చేయడానికైనా నేను సిద్ధం అంటూ తన పట్టుదలను చెప్పుకొచ్చారు. 2010లో విడుదలైన ‘అదుర్స్’లో ఎన్టీఆర్ నరసింహ, చారీ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు
2010లో విడుదలైన 'అదుర్స్'లో ఎన్టీఆర్ నరసింహ, చారీ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా అమాయక బ్రాహ్మణ యువకుడిగా చారీ పాత్రలో ఆయన పలికించిన సంభాషణలు, హావభావాలు, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్రహ్మానందం పోషించిన భట్టు పాత్రతో ఆయన పండించిన వినోదం ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంది. అంతే కాదు ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌గా ఏలేది ఈ మూవీ కంటెంటే. అందుకే చారీని మరోసారి వెండితెరపై చూడాలన్నది అభిమానుల కోరిక.
గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్', 'దేవర'లతో పాటు ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' లాంటి పవర్ ప్యాక్డ్ యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. వరుస సీరియస్ రోల్స్ తర్వాత అభిమానులు కూడా తారక్‌ను మళ్లీ పక్కా కామెడీ లుక్‌లో చూడాలని ఎంతగానో కోరుకుంటున్నారు. ఒకవేళ కోన వెంకట్ చెప్పిన ఈ భేటీ సఫలమై, సీక్వెల్‌కి గ్రీన్ సిగ్నల్ పడితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల రచ్చ మళ్లీ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి చారీ స్వామి మళ్లీ పూనకం తెప్పిస్తారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
