- ఫిర్యాదులకు అధికారులు వారంలోగా సమాధానం చెప్పాల్సిందే
- హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ ఇస్తున్నాం
- ఖాళీ స్థలాల్లో ఫిజికల్ యాక్టివిటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
- త్వరలోనే హెచ్ సిటీ పనులకు భూసేకరణ
- రోడ్ల పక్కన చెత్త వేస్తే రూ.10 లక్షల వరకు జరిమానా
- మీడియాతో చిట్ చాట్ లో సీఎంసీ కమిషనర్ సృజన
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రీవెన్స్ కే ఫస్ట్ప్రయారిటీ ఇస్తున్నాం.. ప్రజల నుంచి అందిన ప్రతీ ఫిర్యాదుకు అధికారులు వారంలోగా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని ఆదేశించాం.. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు.
శనివారం హైటెక్ సిటీ న్యాక్ లోని సీఎంసీ ఆఫీస్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి, పలు వివరాలు వెల్లడించారు. సీఎంసీ పరిధిలో గ్రేవెన్స్ కు సంబంధించి ఫిర్యాదు చేసిన వారికి.. పని అవుతుందో లేదో వారం రోజుల్లో తెలియజేస్తున్నాన్నారు. దీంతో ఒకే సమస్యపై రెండోసారి చేసే ఫిర్యాదులు 90 శాతం తగ్గాయని చెప్పారు. డైలీ గ్రేవెన్స్ పైనే రెండున్నర గంటలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నానని పేర్కొన్నారు.
సీఎంసీకి 777 ఆస్తులు ఉన్నాయి
సీఎంసీకి 777 ఆస్తులను ఉన్నాయి. వీటిలో 440 ప్రాంతాల్లో కాంపౌండ్ వాల్స్ లేవు. సంబంధిత పనులు చేపడుతున్నాం. ఈ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తాం. నగర ట్రాఫిక్‌ను మెరుగుపరిచేందుకు 74 ప్రధాన జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించాం. సీఎంసీ పరిధిలో మొత్తం 54 వాటర్ లాగింగ్ పాయింట్లు గుర్తించాం. వీటిలో 38 ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
వేగంగా ఫ్లైఓవర్పనులు
ఖాజాగూడ–ట్రిపుల్ ఐటీ ఫ్లైఓవర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హెచ్‌సిటీ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. టీడీఆర్‌లు జారీ కాకపోవడం వాస్తవమే. నిధుల కొరత కారణంగా భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. భూసేకరణను త్వరలోనే ప్రారంభించి, భూ యజమానులకు పరిహారంగా టీడీఆర్‌లను జారీ చేస్తాం.
నాలాల్లో డీసిల్టింగ్ పనులు పూర్తి చేశాం
270 నాలాల్లో డీసిల్టింగ్ పనులు పూర్తి చేశాం ఎక్కడైనా క్లోజ్ డ్నాలాలు ఉంటే తవ్వకాలు జరిపి క్లీన్ చేసి పైన గ్రిల్స్ ఏర్పాటు చేస్తాం. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా కేంద్రం నుంచి రూ.180 కోట్లు రావాల్సి ఉంది. వచ్చాక టాయిలెట్లు నిర్మిస్తాం. 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా రోడ్ల పక్కన పడేసిన 1,300 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించాం. రోడ్ల పక్కన చెత్త డంప్చేసే వాహనాలకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తాం. అవసరమైతే సంబంధిత వాహనాలను సీజ్ చేస్తాం. సీఎంసీ పరిధిలో యంత్రాల కొనుగోలు, ఇతరత్రా వాటికి హైడ్రా రూ.20 కోట్లు అడిగింది. సంబంధిత బిల్లులు సమర్పిస్తే నేరుగా చెల్లిస్తాం.
హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ ఇస్తున్నాం
హోటళ్లు, రెస్టారెంట్లపై రెగ్యూలర్ గా తనిఖీలు నిర్వహించి, వాటి ప్రమాణాలను బట్టి రేటింగ్ ఇస్తున్నాం. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే దీని లక్ష్యం. రేటింగ్ ఆధారంగా ఏ హోటల్‌ను ఎంచుకోవాలనేది పూర్తిగా ప్రజల నిర్ణయం. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లోనూ తనిఖీలు చేస్తున్నాం. ప్రస్తుతం పిల్లల్లో ఫోన్ వినియోగం వ్యసనంగా మారడానికి శారీరక శ్రమ లేకపోవడమే కారణం. నగరంలోని ఖాళీ స్థలాల్లో అన్ని వయసుల వారికి అనువైన ఫిజికల్ యాక్టివిటీ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
పాత సామగ్రి తరలించేందుకు స్పెషల్ డ్రైవ్
పాత బెడ్లు, బెడ్ షీట్లు తదితర వస్తువులను తరలించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఇందుకు సంబంధించి ఎక్కడ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్న వివరాలు ముందుగానే తెలియజేస్తాం. ప్రతీ శనివారం ఫుట్ పాత్ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్పేర్కొన్నారు.
