సత్య దేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా తెరకెక్కించిన చిత్రం ‘రావు బహదూర్’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తెలియజేయడానికి శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘నేను ప్రతీ సినిమాకు ఇదే స్థాయిలో కష్టపడ్డాను. కానీ చాలావరకు నిరాశే ఎదురైంది. సక్సెస్ అనేది నాకు కొత్త. ఈ సినిమాతో విజయం వచ్చింది అని వినడం కంటే ఇది చూడకపోతే ప్రేక్షకులు ఏదో కోల్పోతారని ఫీలయ్యాను.
అందుకే ఈ సినిమా ఆడాలనుకున్నా. గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని చెప్పాడు. వెంకటేష్ మహా మాట్లాడుతూ ‘నేను ఏ కథ రాసినా సత్యదేవ్‌కు నచ్చుతుంది. ఫిల్మ్ మేకర్‌గా ఉన్నంతకాలం తనతో సినిమాలు చేయాలనుకుంటున్నా. ఇక దీపా థామస్ పర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయా. వికాస్ పోషించిన ఆచారి పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో మా సినిమాపై వ్యాసాలు రాస్తున్నారు. ఇంతకంటే నాకు ఏం కావాలి.
మా మూవీని సెలెబ్రేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు. తమ శ్రమను గుర్తించి మెచ్చుకుంటున్న ప్రేక్షకులకు నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. సత్యదేవ్ నటనతో పాటు వెంకటేష్ మహా మేకింగ్‌కు అవార్డులు వస్తాయని హీరోయిన్ దీపా థామస్ చెప్పింది. నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సమవర్తి: మరోవైపు శనివారం సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న మరో చిత్రం ‘సమవర్తి’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో చేతిలో కత్తితో ఇంటెన్స్ లుక్‌లో సత్యదేవ్ కనిపించి ఆకట్టుకుంటున్నాడు. అజయ్ నాగ్. వి దర్శకత్వంలో శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
