- ఆన్ లైన్ గ్యాంబ్లింగ్‌లో నష్టపోవడంతో చోరీల బాట
- వివరాలు వెల్లడించిన కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో బంగారు ఆభరణాలు లాక్కొని మహిళను బావిలో తోసి పరారైన నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన ధమ్మ దినేశ్ రెడ్డి(21) కరీంనగర్ లో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. ఇతడు డీఐయూడబ్ల్యూఐఎన్, జియో లాటరీ వంటి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, కలర్ ట్రేడింగ్ గేమ్స్ కు బానిసై రూ.4 లక్షలు నష్టపోయాడు. పలు లోన్ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకున్నాడు.
యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరగడంతో డబ్బుల కోసం దోపిడీకి స్కెచ్ వేశాడు. ఈ నెల 1న ఉదయం కరీంనగర్ టవర్ సర్కిల్ సమీపంలోని లేబర్ అడ్డా వద్ద కూలీ కోసం వేచి ఉన్న గంగాధర లక్ష్మి(55)ని పని ఉందని ర్యాపిడో బైక్ పై తీసుకెళ్లాడు. నుస్తులాపూర్ గ్రామ శివారులో పొలాల వద్ద బాధితురాలిపై దాడి చేసి ఆమె మెడలోని పుస్తెలు, బంగారు గుండ్లు, చెవిపోగు, వెండి మెట్టెలను లాక్కొని బాధితురాలిని బావిలోకి తోశాడు.
ఆమె బావిలో ఉన్న తాడును పట్టుకొని రాత్రంతా బావిలోనే గడిపింది. మరుసటి రోజు ఉదయం పొలం వద్దకు వచ్చిన రైతులు ఆమె కేకలు విని బయటకు తీశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మొబైల్ తో పాటు బాధితురాలి మొబైల్, రూ.5 వేల నగదు, 20 గ్రాముల వెండి మెట్టెలను, నగల వ్యాపారి వేణుమనోహర చారిని అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు చేసుకున్నారు. కేసును ఛేదించిన ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు కె. రాంచందర్ రావు, తిరుమల్, ఎస్సైలు సుమన్, చేరాలు, భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్, కానిస్టేబుళ్లు లక్ష్మీపతి, రాజ్‌కుమార్, ప్రశాంత్ ను సీపీ అభినందించారు.
