- మూడపల్లిలో 200 కోట్లతో చేపట్టే ఇంటిగ్రేటేడ్ స్కూల్‌కు శంకుస్థాపన
వేములవాడ, వెలుగు: ఎన్నికల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం శిలాఫలకాలు ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ వచ్చాకే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని వేములవాడ ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్ అన్నారు. టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో రూ.200 కోట్లతో చేపట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణానికి కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేములవాడ నియోజకవర్గానికి మణిహారంగా నిలుస్తుందన్నారు. రుద్రంగిలో 10 ఎకరాల్లో రూ.46 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, ఆరు కోర్సుల్లో 200 పైగా విద్యార్థులు శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. రాజన్న ఆలయాన్ని రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, మర్రిపల్లిలో 40 ఎకరాల్లో అత్యాధునిక గోశాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
రూ.వేయి కోట్లతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ పుల్కం రాజు, ఈడబ్ల్యూ ఐడీసీ ఎస్ఈ రవీందర్, ఆర్డీవో కేఎస్బీ కుమారి, సర్పంచ్ మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
